వారం రోజుల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్‌ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలని నిబంధన లేదని అన్నారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌గా నేతల ఏకాభిప్రాయంతో సెలెక్ట్ చేస్తారని వివరించారు.
“బీఆర్ఎస్ పార్టీలో తదుపరి అధ్యక్షుడు ఎవరో తెలిసిపోయింది.. బీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. బీజేపీలో వచ్చే అధ్యక్షుడు ఎవరో ఎవరూ చెప్పలేరు.కొత్త సభ్యత్వాలు, పోలింగ్ బూత్ కమిటీలు, మండల కమిటీలు పూర్తయ్యాయి. జిల్లా కమిటీల ఎన్నిక ప్రక్రియ నడుస్తోంది. 600 మండల కమిటీలు పూర్తి చేస్తాం.. అందులో 50 శాతంపైగా బీసీలకే అధ్యక్ష బాధ్యతలు ఇచ్చాం. పార్టీలో మహిళలకు 33 శాతం పదవులు ఇస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.
తెలంగాణలో ఎవరితో పొత్తు ఉండదు.. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. గ్రామ పంచాయతీలకు మూడు విడతల నిధులు రాలేదంటే అందుకు కారణం స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడమే. రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయా ?. ఉచితాలు వద్దు అని బీజేపీ ఎక్కడా చెప్పలేదు.. రాష్ట్ర ఆదాయ వనరులు చూసుకొని పథకాలు అమలు చేయాలి. సంక్షేమ కార్యక్రమాలను కేంద్రానికి వచ్చే ఆర్థిక వనరులను బేరీజు వేసుకొని అమలు చేస్తున్నాం.
హైదరాబాద్‌లో 7 నెలలుగా వీధి దీపాలకు నిధుల కొరత ఉందంటున్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు కేటాయించాం. టెక్స్‌టైట్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, రీజినల్ రింగ్ రోడ్ నేనే తెచ్చా. ప్రధానిని ఒప్పించి మహబూబ్ నగర్ సభలో పసుపు బోర్డ్ ప్రకటన నేనే చేయించా. బీజేపీ సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకం కాదు.. రిసోర్స్ ఆర్థిక వనరులను చూసి పథకాలను అమలు చేయాలి.
తెలంగాణలో బీర్, బ్రాండ్ వచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేశారు. హైడ్రా కొత్తది కాదు.. గతంలో ఉన్న చట్టానికి పేరు మార్చారు. చెరువుల కబ్జాల విషయంలో గత ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని పాలు తాగాయి.. ఇప్పుడు కళ్ళు తెరిచి పాలు తాగాలని చూస్తున్నాయి. హైదరాబాద్ లో గతంలో మెట్రోకి రూ.1250 కోట్లు కేంద్రం నుంచి ఇచ్చాం. వివిధ రాష్ట్రాలకు దశలవారీగా మెట్రో విస్తరణకు సహకరిస్తాం. హైద్రాబాద్‌లో మెట్రో విస్తరణకు ఖచ్చితంగా సహకరిస్తాం. విజయవాడ, విశాఖ మెట్రో ప్రతిపాదనలు వచ్చాయి. రీజినల్ రింగ్ రైల్ సర్వేకు కేంద్రం డబ్బులు ఇచ్చింది. రెవెన్యూ అలైన్‌మెంట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.
తెలంగాణలో బీజేపీని ఓడించడానికి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు సహకరిస్తోంది. ఎంఐఎం నేతలు.. బీజేపీపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకుంది. ఎంఐఎం నేతలు పిట్టల దొరలుగా మారారు.
మూసీ సుందరీకరణకు కేంద్రం నిధులు నిబంధనల మేరకు ఖచ్చితంగా ఇస్తాం. రైతు వేదికలు, స్మశాన వాటికలు, ఇంకుడు గుంతలు ఇస్తాం.
చిరంజీవి అగ్రనటుడు.. నా మాట కాదనకుండా పిలిచిన ప్రతి కార్యక్రమానికి వస్తున్నారు. బీజేపీలో చాలా మంది సినీ నటులు పనిచేశారు.. కొంతమంది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొంతమంది సినిమావాళ్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీగా పోటీ చేశారు. కేంద్ర మంత్రులు కూడా అయ్యారు. నాగార్జున, వెంకటేష్..ఇలా ఎవరైనా సినిమావాళ్లు పిలిస్తే వస్తామంటే ఖచ్చితంగా నేను పిలుస్తా”..అని కిషన్ రెడ్డి అన్నారు.