కాశీకి పోయాను రామాహరి, గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి…అనే హాస్యయుత గేయం ఓ పాత సినిమాలో ఉంది. ఇందులో కాశీ హర క్షేత్రం కాగా, రామాహరి.. హరికి సంబంధించిన సంబోధన. అయితే, హర, హరి పుణ్యక్షేత్రాల దర్శనానికి, అతి పవిత్ర కుంభమేళాలో పుణ్యనదీ స్నానాలకు ఓ చక్కని అవకాశాన్ని కల్పించడానికి ఐఆర్ సీటీసీ ముందుకొచ్చింది. పూర్వకాలం కాశీ యాత్రకు, పుణ్యక్షేత్రాల యాత్రలకు గ్రామ పౌరోహిత్య విప్రుడు, యాత్రా నిర్వాహకులు కలిసి స్వయంగా యాత్రికులను తీసుకెళ్లేవారు. దగ్గరుండి అన్నీ చూపించి జాగ్రత్తగా తిరిగి తీసుకొచ్చేవారు. యాత్రికుల నుంచి తృణమో, పణమో తీసుకుని బతుకు బండి లాగించేవారు. సునాయాసంగా, అనాయాసంగా స్వల్ప మొత్తంలో తీర్థయాత్రలు దర్శించుకునే అవకాశం ఉండడంతో.. భక్తులు, యాత్రికులు సైతం ఈ మార్గంలో పుణ్యక్షేత్రాలు దర్శించుకునేవారు.
కాలానుగుణ మార్పుల్లో ప్రైవేట్ ట్రావెల్స్, సౌకర్యవంత టూరిజం ప్యాకేజీలు, బస చేసే కాటేజీలు, ఏసీలు, స్లీపర్ బస్సులు, ఆన్ లైన్ పేమెంట్లు…ఇలా ఎన్నో వచ్చేశాయి. స్మార్ట్ ఫోన్లలో నీట్ గా అడ్వాన్స్ బుకింగ్ లు చేసేసుకోవడం…తీర్థ యాత్రలు, విహార యాత్రలను రోజుల వ్యవధిలో పూర్తిచేసేసుకోవడం…తిరిగి తమ కార్యకలాపాల్లో నిమగ్నమైపోవడం.. ఇదీ ప్రస్తుత తంతు. అయితే, ఒక ఊరి వారో, ఒక పేటవారో.. అందరూ కలిసి యాత్ర సాగించడంలో ఓ థ్రిల్ ఉంటుంది. ఎన్నో సినిమాల్లో తీర్థా స్పెషల్ సన్నివేశాలు చూశాం. అయితే, ఓ పాత సినిమాలో భద్రాద్రికి…ఓ కాలనీవాసులందరూ పెద్ద పడవ మీద బయల్దేరడం.. ఆ ప్రయాణంలో ఎన్నో ఘట్టాలు చోటుచేసుకోవడం మనం చిత్రంలో చూశాం. విభిన్న మనస్థత్వాలు ఉన్న జనాలు…అందరూ కలిసిమెలిసి చక్కగా యాత్ర సాగించడాన్ని ఆ సినిమాలో చూశాం. ప్రేమలు, ఆప్యాయతలు, కోపాలు, తాపాలు, పూజలు, పునస్కారాలు, ఫంక్తి భోజనాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, సొమ్ముతోనే సర్వం లభించేయవనే సందేశాలు..ఇలా ఎన్నో ఉంటాయి. అయితే, బోట్ ప్రయాణం ప్రారంభించేటప్పుడు పంచవటీ కాలనీవాసులు ఏ ఉత్సాహం చూపించారో అదే ఉత్సాహాన్ని చివర గమ్యస్థానం చేరాక చూపిస్తారు. పడవ ప్రయాణ నడమ ఈ సరదా, కోపతాప ఘట్టాలన్నీ ఉంటాయి. భద్రాద్రిలో రామయ్యను దర్శించుకుని తిరిగి వస్తారు.ఇదో మధురానుభూతి. ఈ తరహా మధురానుభూతి భక్తులు, యాత్రికులకు కల్గించడానికి ఐఆర్ సీటీసీ సంసిద్ధం అవ్వడం ప్రశంసనీయం.
బోట్ లో భద్రాద్రికి వెళ్లే సీన్లు ఆ చిత్రంలో ఉండగా, ఇప్పుడు రైల్లో అయ్యోధ్య, కాశీ, ప్రయాగ్ రాజ్ కుంభమేళా స్నానాలు, దైవదర్శనాలకు ఐఆర్ సీటీసీ సిద్దమైంది. పూర్వకాలంలో యాత్రాగైడ్, ట్రావెల్స్ డ్యూటీ తీసుకున్న ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్… ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తోంది. భక్తులు, యాత్రికుల పుణ్యతీర్థ, పుణ్యక్షేత్ర యాత్రకు ఎనిమిది రోజుల ప్రత్యేక ప్యాకేజి ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో 45 రోజులపాటు జరిగే కుంభమేళా పుణ్యస్నానాల పరంపర విజయవంతంగా కొనసాగుతోంది. ఎక్కడో ఉత్తరాది కుంభమేళాకు…ఈ దక్షిణాది ప్రజలు వెళ్లాలంటే ఎన్నో కష్టనష్టాలు ఉంటాయి. ప్రయాగ్ రాజ్, త్రివేణి సంగమం, కాశీ యాత్రలకు తొలిసారి వెళ్లేవారు ఎందరో ఉంటారు. ఒక్కరుగానో, కుటుంబంగానో అక్కడకు నానా హైరానా పడి వెళ్లినా… రాష్ట్రం కాని రాష్ట్రంలో, భాష కాని భాషతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులు ఏమీ లేకుండా ఐఆర్ సీటీసీ ప్రత్యేక రైలును నడుపుతోంది. ఈ టూర్ కు సంబంధించిన మొత్తం వివరాలను ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెల్లడించింది.
ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి మహాకుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర ప్రత్యేక రైలు బయలుదేరుతుందని, తిరిగి ఈ రైలు 22 న సికింద్రాబాద్ కు చేరుకుంటుందని ఐఆర్ సీటీసీ తెలియజేసింది. వారం రోజుల పాటు సాగే మహాకుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర ప్రత్యేక రైలుకు ఐఆర్ సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. వరుణ, అసి నదులు కలిసి త్రివేణి నదుల సంగమ క్షేత్రం ప్రయాగ్ రాజ్, వారణాసిగా మారిన కాశీ పుణ్యక్షేత్రం, రామ జన్మభూమి అయోధ్యాపురి క్షేత్రాలను దర్శంచుకుని కేవలం ఎనిమిది రోజుల్లో తిరిగి వచ్చేవిధంగా ఈ ప్యాకేజీని ఐఆర్ సీటీసీ రూపొందించింది.
టోటల్ గా 578 మంది సామర్థ్యంతో కూడిన ఈ స్పెషల్ ట్రెయిన్ ఫిబ్రవరి 15 న సికింద్రాబ్ నుంచి బయలుదేరి 18న ప్రయాగ రాజ్ కు చేరుకుంటుంది. కుంభమేళాలో భక్తులు పుణ్యస్నానాలు చేశాక ఈ నెల 19న వారణాసిలో కాశీ విశ్వనాథ్, కాశీ విశాలాక్షి, కాశీ అన్నపూర్ణాదేవి ఆలయాలను భక్తులు దర్శించుకుంటారు. ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుని 20 వ తేదీన అయోధ్యకు చేరుకుంటారు. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హిని సందర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. ఈ నెల 22 రాత్రికి సికింద్రాబాద్ చేరుకుంటారు. యాత్రికులు ఎక్కి దిగేందుకు ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఛత్రపూర్, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలసూర్, స్టేషన్లలో ఆగుతుందని ఐఆర్ సీటీసీ అధికారులు వెల్లడించారు. యాత్రలో ప్యాకేజీకు సబంధించి పెద్దలకు 23,035 రూపాయలుగా, అయిదు నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు 22,140 రూపాయలు చార్జీలు ఖరారు చేసినట్టు ఐఆర్ సీటీసీ వర్గాలు తెలిపాయి. ఏసీ బోగీల చార్జీలు వేరుగా ఉంటాయని పేర్కొన్నాయి.
ఇక నదీమ తల్లుల పండుగల గురించి ఒకసారి చూస్తే దక్షిణాదివాసులు పన్నెండేళ్లకోసారి పన్నెండు నదుల్లో ఒక పుణ్యనది పుష్కరాలు నిర్వహించుకోగా, ఉత్తరాది వారు సైతం ప్రతి పన్నెండేళ్లకోసారి మహా కుంభమేళా నిర్వహిస్తారు. దీనికి ముందు ప్రతి నాలుగేళ్లకోసారి కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు. హరిద్వార్ లేక ప్రయాగ్ రాజ్ లో ఆరేళ్లకోసారి అర్థకుంభమేళా నిర్వహించగా, పూర్ణకుంభమేళ ప్రతి పన్నెండేళ్లకోసారి ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయినీ, నాసిక్ లో నిర్వహిస్తారు. 2013 లో ప్రయాగ్ రాజ్ లో పన్నెండేళ్ల కోసారి జరిగే కుంభమేళా నిర్వహించగా, ఇప్పుడు 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహత్తర కుంభమేళా నిర్వహిస్తున్నారు.
సూర్యుడు మకరరాశి ప్రవేశ సమయంలో, ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభ సమయంలో, మకర సంక్రాంతి పర్వదినం నుంచి మహా కుంభం ప్రారంభమవుతుందని హైందవ పురాణాలు చెబుతున్నాయి. పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక మహా కుంభమేళా జరుగుతుందని అంటే 144 ఏళ్లకు ఓసారి ఈ వేడుక జరుగుతుందని పెద్దలు చెబుతున్నారు. పుష్కరాలైనా, కుంభమేళా అయినా పన్నెండు సంఖ్యమీదే వెళుతుంది. దేవతలకు ఒకరోజు మానవులకు ఏడాది కాలం. దేవతల పగటి కాలం ఆరు నెలలు ఉత్తరాయణం, దేవతల రాత్రి కాలం ఆరు నెలలు దక్షిణాయనం. దేవతాకాలమనం ప్రకారం పన్నెండేళ్లు మానవులకు 144 ఏళ్లు. పన్నెండేళ్లకు పూర్ణకుంభమేళా జరగగా 144 ఏళ్లకు మహాకుంభమేళా జరుగుతుందని పండిత ప్రముఖులు, పురాణ శ్రేష్టులు తెలియజేస్తున్నారు.