రైతులు చేపట్టిన ఆందోళనా కార్యక్రమాల ఫలితంగా ఢిల్లీ నగరంలో యుద్ధ వాతావరణం నెలకొంది. రైతులను కట్టడి చేయడానికి ఢిల్లీ నగరంలో పెద్దఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా రాజధానికి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అంతేకాదు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలు కూడా కదలకుండా ఆగిపోయాయి. ఢిల్లీ నగరంలో ఎటుచూసినా బ్యారికేడ్లు కనిపించాయి. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల ఆందోళనా కార్యక్రమాల నేపథ్యంలో ఢిల్లీలో మార్చి 12 వరకు 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు.
రైతుల ఆందోళనలను భగ్నం చేయడానికి పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. రహదారులపై బహుళ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పలు చోట్ల కాంక్రీట్ బ్లాక్స్, ఇనుప కంచెలు, మేకులను అడ్డుగా పెట్టారు. ముందు జాగ్రత్త చర్యగా పార్లమెంట్ సమీపంలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి బయల్దేరారు. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇదిలా ఉంటే గాజీపుర్, చిల్లా సరిహద్దుల్లోని హైవేలపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. కిలోమీటరు దూరానికే గంటలు గంటలు సమయం పట్టింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఛలో ఢిల్లీ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే వీరిని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.రైతులు తలపెట్టిన మెగా మార్చ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఢిల్లీ దిశగా కదులుతున్న వారిని అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టియర్ గ్యాస్ ప్రయోగంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.
ఒకదశలో రైతులను చెల్లాచెదురు చేయడానికి డ్రోన్లతో స్మోక్ బాంబ్స్‌ను జారవిడిచారు. దీంతో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. ఢిల్లీ సరిహద్దులో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పంజాబ్-హర్యానా శంభు సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రైతులను అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఢిల్లీని అష్టదిగ్భంధనం చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. రైతుల ఆందోళనను విరమింప చేయడానికి చివరివరకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. రైతు సంఘాల నాయకులతో రెండో దఫా చర్చలు కూడా నిర్వహించింది. కొన్ని డిమాండ్లపై అంగీకారం కుదిరినా, కనీస మద్దతు ధరపై స్పష్టత రాలేదని కేంద్ర వ్యవసాయమంత్రి అర్జున్ ముండా తెలిపారు.


