కమలంతో జతకట్టనున్న జనసేనాని…. !

       మళ్లీ హస్తిన పర్యటనకు జనసేనాని. అవును.. ఏపీలో రాజకీయం హాట్‌హాట్‌గా సాగుతున్న వేళ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అతి త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. మరి.. ఈ టూర్‌ లోనైనా పొత్తుల వ్యవహారంపై ఓ క్లారిటీ వస్తుందా ? ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తులో ఉన్నాయి. అటు జనసేన-బీజేపీ సైతం కలిసి కట్టుగా సాగుతు న్నాయి. మరి.. ఈ రెండు కూటములను కలిపి ఒకే జట్టుగా చేసేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్న పవన్ కృషి సఫలమయ్యేనా ? ఇప్పటికే కమలం పెద్దలతో సుదీర్ఘ చర్చలు జరిపిన టీడీపీ అధినేత చంద్రబాబు… రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు ? రాష్ట్ర రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌.

       ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి అధికార విపక్షాలు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా 2024 ఎన్నికలు అన్ని పార్టీలకూ అత్యంత ప్రతిష్టా త్మకంగా మారాయి. దీంతో.. వచ్చే ఎన్ని కల్లో మరోసారి గెలుపొంది ప్రతిపక్ష పార్టీలపై పూర్తిస్థాయిలో పైచేయి సాధించాలని భావిస్తోంది అధికార వైసీపీ. అదే సమయంలో ఈసారి అధికారంలోకి రాకుంటే భవిష్యత్‌లో మరింత ఇబ్బందేనన్న భావనతో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి కట్టుగా ఏర్పడి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో జగన్ సర్కారుపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందన్న అంచనా లతో ఉన్న విపక్షాలు.. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని సానుకూల ఫలితాలు రాబ ట్టాలని ప్రయత్నిస్తున్నాయి.

      ఎన్నికల షెడ్యూలు వచ్చేనెల రెండో వారంలో రావచ్చన్న ప్రచారం తాజాగా విన్పిస్తోంది. దీంతో.. ఆలోగా అభ్యర్థుల్ని ఖరారు చేయడంతోపాటు కార్యకర్తల్ని ఎన్నికల సమరాంగణానికి సన్నద్దం చేసే పనిలో ఉన్నాయి అన్ని పార్టీలు. ఈ అంశంలో అధికార వైసీపీ వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణ కాస్త పక్కన పెడితే.. ప్రతిపక్ష పార్టీల గురించి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కోసం సిద్ధమవుతున్న విపక్షాలు ముందుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా దృష్టి సారిస్తు న్నాయి. 2019 ఎన్నికల్లో విపక్షాలు ఒంటరిగా పోటీ చేయడంతో వైసీపీ గణనీ యంగా లాభపడింది. కానీ, ఈసారి ఆ పరిస్థితి రానివ్వద్దంటూ ముందుగానే ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆ దిశగా తొలి అడుగు వేసిన ఆయన.. తెలుగు దేశం పార్టీతో చేతులు కలిపారు. దీంతో.. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయడానికి సిద్దమయ్యాయి. అయితే.. ఆ సమయంలోనే బీజేపీని సైతం తమతో కలిసి రావాలంటూ విజ్ఞప్తి చేశారు పవన్. అంతేకాదు.. ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్… టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాల్సిన ఆవశ్యకతను, అవసరాన్ని కమలం అగ్రనేతల దృష్టికి వీలు దొరికినప్పుడల్లా తీసు కొచ్చారు. ఇటీవలె ఈ విషయంలో కదలిక రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. దీంతో.. అప్పట్నుంచి కమలం పార్టీ కూడా టీడీపీ-జనసేనలతో చేతులు కలపబోతోందన్న ప్రచారం జోరందుకుంది. అయితే.. ఇంకా పూర్తిస్థాయిలో చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఇప్పుడు జనసేనాని పవన్.. అతి త్వరలోనే ఢిల్లీ పర్యటన కు వెళ్లబోతున్నారు.

      బీజేపీ అగ్రనేతల అపాయింట్‌మెంట్లు ఖరారయ్యే తేదీల ఆధారంగా పవన్ కల్యాణ్ హస్తిన టూర్ ఆధారపడి ఉంది. అయితే…ఇప్పటికే టీడీపీ-జనసేన అధినేతలు ఇద్దరూ మూడు నాలుగుసార్లు సమావేశమై పొత్తుల వ్యవహారా లు, సీట్ల సర్థుబాటు.. అనంతరం ఇరుపార్టీల నేతల్లో తలెత్తే అభ్యంత రాలు పరిష్కరించేందుకు, అసంతృప్తులు చల్లార్చేందుకు ఏం చేయాలి.. ఎలా ముందుకెళ్లాలి… ఆయా పార్టీల నేతల భవిష్యత్‌కు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వాలన్న దానిపై చర్చించారు. అంతేకాదు.. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు ఎవరెన్ని చోట్ల అసెంబ్లీకి పోటీ చేయాలి. ..పార్లమెంటు బరిలో ఉండాలి అన్నదానిపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం సాగింది. అయితే… కమలం నేతల నుంచి పిలుపు రావడంతో కొద్ది రోజుల క్రితమే హుటాహుటిన టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని తెలుగు దేశం వర్గాలే ప్రకటించాయి. నాటి పర్యటనలో చంద్రబాబు.. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సమయంలోనే టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటీ చేయాల్సిన అవసరాన్ని అలాగే వైసీపీని ఇంటికి పంపించాల్సిన ఆవశ్యకతను చంద్రబాబు.. కమలం అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో..సూత్రప్రాయంగా బీజేపీ నేతలు సైతం పొత్తుకు అంగీకరించారని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. అయితే.. పార్లమెంటు సీట్ల సంఖ్య విష యంలోనే కాస్త ప్రతిష్టంభన ఏర్పడిందన్న ప్రచారం సాగుతోంది. అయితే.. ఇప్పటికే టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తున్న పవన్… ఇదే అంశంపై బీజేపీ పెద్దలతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే ఢిల్లీ పర్యటన పెట్టుకున్నట్లు సమాచారం. మరి.. పవన్ పర్యటనతోనైనా విపక్షాల పొత్తులపై ఓ క్లారిటీ వస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

      ఓవైపు.. సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ముంచుకొస్తున్నా.. పొత్తుల విషయం ఇంకా పూర్తిస్థాయిలో తేలక పోవడంతో టీడీపీ, జనసేన కేడర్‌లో కొంత కన్ఫ్యూజన్ ఉంది అన్న వాదన విన్పి స్తోంది. అయితే… శ్రేణుల్లో ఎలాం టి నిరాశా, నిస్పృహలు కన్పించకుండా చూసేందుకు టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తు న్నారు. ఓవైపు పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనల్లో ఉన్నారు. పార్టీ నేతలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో పొత్తు ఉన్న నేపథ్యంలో త్యాగాలకు సిద్ధం కావాలని.. అధికారంలోకి వచ్చాక తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెబుతున్నారు. అటు.. టీడీపీ అధినేత సైతం ఇదే మాదిరిగా సీని యర్లు, పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. అభ్యర్థుల ఖరారు, ఎన్నికల వ్యూహాలు, ప్రచారం సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ తీరును ఎప్పటి కప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్లు, పార్టీ నేతలతో వరుస సమావేశాలతో బిజీగా ఉండడంతో తనవంతుగా ప్రచారాన్నిహోరెత్తిస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. శంఖారావం పేరుతో యాత్ర నిర్వహిస్తున్న ఆయన… వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుప డుతున్నారు. ఏపీలో అరాచకపాలన సాగుతోందన్న ఆయన.. ప్రశాంత వాతావరణం ఉన్న విశాఖను విషాదనగరంగా మార్చేశారని మండి పడ్డారు. ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేసిన ఆయన… అందువల్లే రాప్తాడు సభలో జగన్‌.. పదే పదే చంద్రబాబు పేరు గుర్తు చేశారని సెటైర్లు వేశారు. ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు నారా లోకేష్.

     మరోవైపు..టీడీపీ, జనసేన అధినేతల దిశానిర్దేశంతో పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశారు ఇరు పార్టీల నేతలు, శ్రేణులు. స్థానికంగా పార్టీ తరఫున కేవలం ప్రచారం చేయడమే కాదు… వైసీపీ నేతల రెచ్చగొట్టే ప్రకటనలు, సవాళ్లపై సైతం గట్టిగానే స్పందిస్తున్నారు టీడీపీ, జనసేన నేతలు. ఈ క్రమంలోనే ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అంటూ ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్‌లు అయినా చేస్తారంటూ వ్యాఖ్యానించారాయన. తన పాలనలో ఇది చేశామంటూ చెప్పుకునేం దుకు ఏమైనా ఉందా అంటూ ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు సజ్జల. వైసీపీ నేతల వ్యాఖ్యలకు గట్టి కౌంటరిచ్చారు టీడీపీ నేత బోండా ఉమ. ప్రజలకు ఇచ్చానని జగన్ చెబుతున్న రెండున్నర లక్షల కోట్లు కల్తీ మద్యం, ఇసుక దోపిడీతో ప్రజల నుంచి కొట్టేసినవేనని ఆరోపించారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, జైళ్లకు పంపడం తప్ప… సీఎం జగన్ తప్ప చేసిందేమీ లేదన్నారు బోండా ఉమ.మొత్తంగా చూస్తే.. పవన్ ఢిల్లీ పర్యటనతోనైనా పొత్తుల విషయంలో ఓ క్లారిటీ వస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్