28.2 C
Hyderabad
Monday, February 9, 2026
spot_img

ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు

     ఎన్నికల బాండ్లకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎన్నికల బాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన పథకం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది.సహజంగా ఎన్నికల బాండ్లలో ఎటువంటి వివరాలు ఉండవు.రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చే దాతలెవరో ఈ బాండ్లలో ఎక్కడా ఉండదు.ఇలా ఊరు పేరు లేకుండా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం పేర్కొంది.

       నల్లధనాన్ని అరికట్టడానికే ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నల్లధనాన్ని అరికట్టడానికి ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకురావడం ఒక్కటే మార్గం కాదని సుప్రీంకోర్టు తెగేసి చెప్పింది. నల్లధనాన్ని అరికట్టాలన్న సదుద్దేశం కేంద్రప్రభుత్వానికి ఉన్నట్లయితే, అందుకు అనేక ఇతర మార్గాలున్నాయన్నాని ధర్మాసనం పేర్కొంది. నల్లధనాన్ని అరికడతామన్న సాకుతో సమాచార హక్కును కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది సమంజసం కాదని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది.

    రాజకీయ పార్టీలు వివిధ కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇవ్వడం ఎప్పటి నుంచో ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఎన్నికల బాండ్లకు లేనిపోని ప్రత్యేకత అంటకడుతూ విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ఇన్నేళ్లుగా రహస్యంగా ఉంచుతున్నారని సుప్రీంకోర్టు వెల్లడించింది. దాతల పేర్లు రహస్యంగా ఉంచడం అంటే ఆదాయపు అలాగే పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించడమేనని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కార్పొరేట్ సంస్థల నుంచి లెక్కకుమించిన రాజకీయ విరాళాలను అనుమతించడానికి వీలుగా కంపెనీల చట్టంలో చేసిన సవరణలను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు ఈ సవరణలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.

      రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలు విరాళాలు ఇచ్చే విధానం పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూ లంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మొత్తంగా ఎన్నికల బాండ్ల పథకంలో పారదర్శకత లోపించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఈ నేపథ్యంలో ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందే విరాళాలను తప్పనిసరిగా వెల్లడించాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.కాగా 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకు ఎన్నికల బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు అందిన నిధులను, వాటి సమగ్ర వివరాలను మార్చి ఆరో తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మార్చి 13లోగా సదరు వివరాలను వెబ్‌సైట్‌లో ప్రచురించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

    రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 జనవరి రెండో తేదీన అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్‌తో పాటు మరికొంతమంది నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల బాండ్ల పథకంపై కిందటేడాది అక్టోబరులో సుప్రీంకోర్టు విచారణ జరిపింది.తాజాగా తీర్పు ఇచ్చింది.

    ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. లంచాలు, కమిషన్ల కోసమే నరేంద్ర మోడీ సర్కార్ ఎన్నికల బాండ్ల పథకం తీసుకువచ్చిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి రాజకీయాలు బహిర్గతమ య్యాయ న్నారు. ఎన్నికల బాండ్ల పథకంతో బీజేపీ పెద్ద ఎత్తున కమిషన్లు స్వీకరించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై అనేక ప్రజా సంఘాలు, బీజేపీయేతర పార్టీలు కూడా హర్షం వ్యక్తం చేశాయి. ఎన్నికల బాండ్ల రూపంలో పెద్ద ఎత్తున రాజకీయ అవినీతికి బీజేపీ వేదిక సన్నద్ధం చేసిందని ఈ పార్టీలు మండిపడ్డాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్