శాంతియుత నిరసనలు తెలిపే ప్రజాస్వామ్య హక్కును అణచివేయడానికే అధికారులు ‘పీస్ బాండ్ల’ను ఆయుధంగా వాడుకుంటున్నారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా విమర్శించారు. రాజ్యాంగం పౌరులకు అందించిన నిరసన తెలిపే హక్కుకు, ప్రభుత్వం అమలు చేస్తున్న పీస్ బాండ్లకు మధ్య తీవ్రమైన వైరుధ్యం ఉందని అన్నారు. ఈ పీస్ బాండ్లపై సంతకాలు చేయడం అంటే తమ ప్రజాస్వామ్య నిరసన హక్కును వదులుకోవడమేనని, అందుకే వీటిపై సంతకాలు చేసే ప్రసక్తే లేదని ఐసా స్పష్టం చేసింది.
అక్టోబర్ 16న మండి హౌస్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను కేవలం 10 నిమిషాల్లోనే అదుపులోకి తీసుకుని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే నెపంతో డిటైన్ చేశారని బోరా పేర్కొన్నారు. పీస్ బాండ్లకు చట్టబద్ధత కల్పించే చర్యలకు ఐసా మద్దతు ఇవ్వదని, ఈ విధానాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేస్తూనే ఉంటామని వెల్లడించారు. న్యాయస్థానాలు రాజ్యాంగ నైతికతను కాపాడతాయని, పీస్ బాండ్ల ద్వారా నిరసన హక్కును ఎలా కాలరాస్తున్నారో గుర్తించి తగిన న్యాయం చేస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలైన ఓటు హక్కు, నిరసన తెలిపే హక్కు తీవ్ర ముప్పులో పడ్డాయని నేహా బోరా ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారనే కథనాలు వస్తున్నాయని, దీనిపై ప్రశ్నించడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని చెప్పారు. వీధుల్లో నిరసన తెలిపే పౌరులు ఎలాంటి హింసకు పాల్పడలేదని, పోలీసులే లాఠీఛార్జ్ చేస్తూ, మహిళా నిరసనకారులతో పాటు జర్నలిస్టులపై కూడా దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. అసలైన శాంతిభద్రతల విఘాతం ప్రజల వైపు నుంచి కాదని, పోలీసుల ప్రవర్తన వల్లే జరిగిందని అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించడం శాంతిభద్రతల సమస్య కాదని, ప్రభుత్వాలు పీస్ బాండ్ల పేరిట గొంతు నొక్కడాన్ని కోర్టులలో ఎండగడతామని నేహా బోరా స్పష్టం చేశారు.
బాండ్లపై సంతకాలు చేసే ప్రసక్తే లేదన్న నేహా బోరా
Latest Articles
- Advertisement -


