స్వతంత్ర వెబ్ డెస్క్: రాబోయేది తమ ప్రభుత్వమేనని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ జోన్-2 సమావేశాన్ని కాకినాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రం పేరు చెప్పి ఇప్పటివరకూ సీఎం జగన్ రూ. 13 లక్షల కోట్లు అప్పు తెచ్చారని ఆరోపించారు. ప్రతి వారం కేంద్రప్రభుత్వం, ఆర్బీఐ నుంచి అప్పులు తెచ్చారని చెప్పారు. అయితే తెచ్చిన ఆ డబ్బు మొత్తం తాడేపల్లి ప్యాలెస్‌కు తరలించారని అచ్చెన్న వ్యాఖ్యానించారు. రూ. 60 వేల కోట్లు విద్యుత్ ఛార్జీల భారం మోపారని మండిపడ్డారు.
సీఎం వ్యవస్థలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఐదు కోట్ల ఆంధ్రులు చీదరించుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇసుకపై రూ. 40 వేల కోట్లు దోచుకున్నారని ఆయన చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ దోచుకున్న డబ్బు మొత్తం రికవరీ చేస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.