సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఈ రోజు ఆర్థిక సాధికారతలో తెలంగాణ మహిళ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. పొదుపు నుంచి పారిశ్రామికవేత్త వరకు తన శక్తిని చాటి చెబుతోంది. మన మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలు. ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలు. బ్యాంకు లింకేజీ స్త్రీ నిధి ద్వారా ఈ సంఘాలకు రూ. లక్ష కోట్లు రుణాలుగా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. రూ.5 లక్షల రుణప రిమితిని రూ.10 లక్షలకు పెంచాం.
ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్తు ప్లాంట్లు, పెట్రోల్ బంకులను మహిళలు నేడు యజమానులు. 1000 బస్సులకు వాళ్లు ఓనర్లు. ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబ్‌లు, గోదాములు, రైస్ మిల్లులు ఏర్పాటుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే రాష్ట్రమంతటా ఒకేరోజున 8 వేల స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, యూనిఫాం కుట్టు కూలీ మహిళా సంఘాలకు అప్పగించాం. శిల్పారామంలో మహిళ సంఘాల ఉత్పత్తుల అమ్మకానికి స్టాళ్లు ఏర్పాటు చేశాం. తెలంగాణ మహిళ దేశ పారిశ్రామిక రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఎంతో దూరంలో లేదు. ఇది ప్రజా ప్రభుత్వ కల. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడబిడ్డలు దాదాపు రూ.10 వేల కోట్లు ఆదా చేసుకోగలిగారు. మహాలక్ష్మి పథకంలో రాష్ట్రంలోని 42.90 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నాం. గృహజ్యోతి కింద 53.09 లక్షల పేదల గృహాలకు 200 యూనిట్ల ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం… అని అన్నారు.


