‘స్వచ్ఛ ఆంధ్ర’ కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కడప జిల్లా మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మన దేశం పరిశుభ్రంగా ఉండాలని గాంధీజీ తపించారని అన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. పారిశుద్ధ్య సాధన దిశగా దేశ ప్రజలంతా చేతులు కలపాలని సూచించారు. జపాన్‌లో రోడ్లు కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంటాయని… అక్కడ కాగితం కూడా జేబులో పెట్టుకుని ఇంట్లోని చెత్తబుట్టలో వేస్తారని చెప్పారు. మనం మాత్రం ఇంట్లో ఉండే చెత్తను రోడ్డుపై పోస్తున్నామని అన్నారు.
గతంలో ఏ ఊరు వెళ్లినా చెత్తాచెదారం కనిపించేదని… గ్రామాల్లో మహిళల పరిస్థితి చూసి ఎంతో బాధపడేవాడినని చంద్రబాబు అన్నారు. ఆరోజుల్లో వంట చేయడం మహిళలకు నరకంగా ఉండేదని.. దీపం కార్యక్రమం కింద ఆనాడు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఇప్పుడు దీపం-2 కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పారు. ఆరోజు తాము ఇచ్చిన నివేదిక మేరకు స్వచ్ఛభారత్ కార్పొరేషన్ తెచ్చారని గుర్తు చేశారు. స్వచ్ఛ ఆంధ్ర కోసం సేవకులుగా పనిచేస్తామని చాలా మంది వచ్చారని. సమాజహితం కోసం కష్టపడేవారిని గుర్తించలన్నారు.
మైదుకూరులో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. తరతరాలుగా వస్తున్న అలవాట్లు త్వరగా పోవు… మంచి అలవాట్లు పాటించేందుకు చాలా సమయం పడుతుందని అన్నారు. చెడు ఆలోచనలు, చెడు పనులు చేయకుండా మన మైండ్‌ను నిత్యం మనమే కంట్రోల్ చేసుకోవాలని సూచించారు. ఇల్లు, పరిసరాలు బాగుంటేనే మంచి ఆలోచనలు వస్తాయన్నారు చంద్రబాబు. ఆహ్లాదకర వాతావరణం ఉంటేనే ఏదైనా సాధించగలమన్న సీఎం.. పని ప్రాంతాన్ని కూడా అందరూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.