స్వతంత్ర వెబ్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానుల నిరీక్షణకు ఇవాళ్టితో తెరపడనుంది. గతేడాది టీ20 ప్రపంచ కప్ అనంతరం ఇండియా-పాకిస్థాన్ జట్లు తలపడుతున్న తొలి మ్యాచ్ ఇదే కానుంది. దీంతో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఆసియా కప్‌లో పాక్‌పై గ్రూప్ దశలో గెలిచిన భారత్.. సూపర్-4లో మాత్రం ఓటమిపాలైంది. దీంతో ఎలాగైనా దాయాదిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. ఈమధ్య పాక్ జట్టు మరింత బలంగా తయారైన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు అంత ఈజీ కాదనిపిస్తోంది.
కీలకమైన ఇండో-పాక్ సమరానికి ముందు మాటల యుద్ధం కూడా హైలైట్ అవుతోంది. ఆసియా కప్‌తో పాటు రాబోయే వన్డే వరల్డ్ కప్‌లోనూ భారత్‌ను ఓడిస్తామని పాక్ మాజీలు, ప్లేయర్లతో పాటు ఫ్యాన్స్ మాటలతో రెచ్చిపోతున్నారు. అయితే ఇరు జట్ల మేనేజ్మెంట్ మ్యాచ్‌లో ఎలా నెగ్గాలా అని వ్యూహాలు పన్నడంలో బిజీ అయిపోయాయి. కాగా, మ్యాచ్‌కు సర్వం సిద్ధమైన తరుణంలో వరుణుడు అందోళన కలిగిస్తున్నాడు. భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో అభిమానుల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చూద్దాం.. హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించి ఇండో-పాక్ మ్యాచ్‌కు శ్రీలంకలోని పల్లెకెలే ఆతిథ్యం ఇస్తోంది.
శ్రీలంకలో ప్రస్తుతం ఓ మోస్తరుగా వానలు పడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం మ్యాచ్ సమయానికి వర్షం పడే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలవ్వనుంది. ఒకవేళ వాన ఆటంకం కలిగిస్తే మ్యాచ్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తారు. మ్యాచ్ అసలే సాధ్యం కాకపోతే ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్ చేరుతుంది. అదే జరిగితే పాకిస్థాన్ ఎలాంటి సమీకరణాలు లేకుండా సూపర్-4 దశకు చేరుకుంటుంది. మరో బెర్త్ కోసం నేపాల్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది. మరి.. మంచి బజ్ నెలకొన్న ఇండో-పాక్ మ్యాచ్‌కు వరుణుడు కరుణిస్తాడో లేకపోతే ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లుతాడో చూడాలి.