ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాల మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఈశాన్య లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 52 మంది మృతి చెందారని, మరో 72 మందికి గాయాలైనట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దాడుల సమయంలో ఆ ప్రాంతంలోని ప్రజలు తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. మరోవైపు దాడుల కారణంగా దక్షిణ బీరుట్‌లోని దహియేలో సైతం పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దాడుల్లో దాదాపు 11 మంది గాయపడినట్లు సమాచారం.
హమాస్‌కు చెందిన సీనియర్ అధికారి ఇజ్ అల్ దిన్ కసబ్‌ను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ ఐడీఎఫ్ పేర్కొంది. గాజా స్ట్రిప్‌లోని ఇతర సమూహాలను కసబ్ సమన్వయం చేయడానికి బాధ్యత వహిస్తుంటాడని తెలిపింది. కసబ్ మరణానికి పాలస్తీనా అధికారులు సంతాపం తెలిపారు. ఎన్‌క్లేవ్‌లో తమ కారుపై టెల్‌అవీవ్ జరిపిన దాడుల్లో అమాన్‌అయేష్ అనే హమాస్ అధికారితో పాటు కసబ్ మృతి చెందినట్లు వెల్లడించింది.