
కడప జిల్లా పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. నామినేషన్ల సందర్భంగా పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ఎంపీ అవినాష్ రెడ్డి సహా వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
కొందరు రాజకీయపార్టీ కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వారిని అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.నామినేషన్లు వేసేందుకు భారీగా పార్టీల కార్యకర్తలు తరలివచ్చారు. కొందరు నేతలు అప్పటికే నామినేషన్ కేంద్రంలోకి వెళ్లారు. వారు వచ్చిన తర్వాతే మరికొందరిని లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. అయితే.. వినకుండా పోలీసులపైకి కొందరు పార్టీ కార్యకర్తలు దూసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. అసలు పులివెందులలో ఏం జరిగింది..? నామినేషన్ల ప్రక్రియ దగ్గర మొదలైన వివాదం కాల్పుల వరకు ఎందుకు వెళ్లింది..? పోలీసుల చర్యలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఎలా స్పందిస్తారు..? ఎన్నికల వేళ పులివెందులలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి..? ఇప్పుడు ఇదే రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.


