తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. తన కాలంలో చేసిన పనులను ఆయన గుర్తు చేసుకున్నారు. తన పదవీకాలాన్ని గుర్తు చేసుకుంటే గర్వంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. తనకు సహకరించిన పార్టీ నేతలకు, పార్టీ సైనికులకు కృతజ్ఞతలు అని తెలిపారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలను మహేష్ కుమార్ గౌడ్‌కి అప్పగించడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ పూర్తి విశ్వాసంతో తనను పీసీసీ చీఫ్ చేశారని గుర్తు చేసుకున్నారు. తన పదవీకాలంలో అత్యంత విలువైన జ్ఞాపకాలున్నాయని, రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడోయాత్ర మరవలేనిదని సీఎం అన్నారు. తుక్కుగూడ సభ చరిత్రలో అతిపెద్ద ఎన్నికల సమావేశాలలో ఒకటని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలు, కల్పితాలు, వైఫల్యాలను బహిర్గతం చేయగలిగామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగామని సీఎం రేవంత్ చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.