ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ‘తండేల్’ సినిమా పైరసీ వీడియో ప్రదర్శించడంతో చిత్ర యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సినిమాకు సంబంధించిన పైరసీ వీడియో బయటకు రావడం ఒక ఎత్తయితే.. ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ బస్సులో సినిమా ప్రదర్శించడం మరో ఎత్తు. దీనిపై నిర్మాత బన్నీ వాసు.. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో కొనకళ్ల విచారణకు ఆదేశించారు.
పలాస డిపోకు చెందిన హైయర్ బస్సులో పైరసీని ప్రదర్శించినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు మీడియాకు తెలిపారు కొనకళ్ల నారాయణరావు. సంబంధిత హైయర్ బస్సును ఆర్టీసీ సర్వీసు నుండి తొలగించామని.. బస్సులో పని చేస్తున్న డ్రైవర్, కండెక్టర్ కూడా ప్రైవేట్ డ్రైవర్, కండెక్టర్లే అని సమాధానమిచ్చారు. ఈ ఘటనపై పలాస డిపో అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారని తెలిపారు.
విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామంటున్నారు కొనకళ్ల. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పైరసీని ఆర్టీసీ ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదని చెబుతున్నారు.
ఇటీవల విడుదలైన ‘తండేల్’ సినిమా పైరసీ వీడియోను ప్రదర్శించిన ఆర్టీసీ బస్సును సర్వీసు నుండి తొలగించినట్టు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ అంటున్నారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిర్యాదు అందిన వెంటనే విచారణకు ఆదేశించామన్నారు. బస్సులో పైరసీ వీడియోని ప్రదర్శించారా..? లేదా..? అన్నదానిపై పలాస డీపో అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారన్నారు. విచారణ నివేదిక అందిన వెంటనే మరిన్ని చర్యలు తీసుకుంటామని కొనకళ్ల నారాయణరావు తెలిపారు.