బీఆర్ఎస్ చేసిన తప్పిదాలనే కాంగ్రెస్ కొనసాగిస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఓట్ల వేటలో ప్రజలను హస్తం పార్టీ మభ్యపెట్టిందని విమర్శించారు. హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలి దశ ఉద్యమంలో 369 మంది ప్రాణాలను ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బలిగొందని లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి కమలం పార్టీ మద్దతు తెలిపి పోరాటం చేసిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ వేడుకలుగా జరుపుకోవడం సరైంది కాదని చెప్పారు. 1200ల మంది బలిదానాల మీద తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర ఉద్యమం సమయంలో సోనియా గాంధీని రేవంత్‌రెడ్డి బలి దేవత అన్నారని చెప్పారు. సీఎం అయ్యాక బలి దేవతను ఎట్లా ఆరాధిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం కవులు కళాకా రులు, ఉద్యమ కారులను విస్మరించిందని లక్ష్మణ్ ఆరోపించారు.