మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది వైసీపీ పరిస్థితి. అసెంబ్లీలో అధికారం పోవడంతో పార్టీ నేతలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్లు కూడా హ్యాండిస్తూ.. వైసీపీ అధినేత జగన్‌కు కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నాయకులు తాము ప్రత్యర్థిగా భావించే పార్టీల్లోకి జంప్ అవగా.. తాజాగా రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, మరో రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావు కూడా పార్టీని వీడి టీడీపీలో చేరనున్నారు. ఈ క్రమంలో ఇవాళ మోపిదేవి వైసీపీకి రాజీనామా చేయనున్నారు. అలాగే బీద మస్తాన్‌రావు కూడా రాజీనామా చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇక వీరి బాటలోనే చేనేత వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఈమె వైసీపీకి గుడ్‌బై చెప్పారు.
గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు మోపిదేవి. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేపల్లె నుంచి ఆయన టికెట్ ఆశించారు. తనకు లేదంటే తన కుమారుడికైనా హైకమాండ్ అసెంబ్లీ టికెట్ ఇస్తుందని భావించారు. కానీ సామాజిక సమీకరణ పేరుతో మోపిదేవి ఫ్యామిలీకి జగన్ టికెట్ నిరాకరించారు. మోపిదేవికి బదులు గణేశ్‌ను రేపల్లె నుంచి బరిలో దించారు. అప్పట్నుంచి అసంతృప్తిలో ఉన్న మోపిదేవి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్లాలని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో చర్చలు కూడా జరిపారు. త్వరలోనే సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన పచ్చకండువా కప్పుకోనున్నారు. ఇక బీద మస్తాన్‌రావు 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్నారు. తర్వాత ఆయన ఎంపీ సీటు కోసం వైసీపీలో చేరారు. అనంతరం జగన్ ఆయనను రాజ్యసభకు పంపించారు. అయితే,.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో వీరు జగన్‌కు హ్యాండిచ్చి టీడీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు.
ఇక ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా టీడీపీ చేరుతారన్న ప్రచారం సాగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నపుడు పార్టీ మహిళా విభాగం అధ్యక్షులుగా పనిచేసిన పోతుల సునీత.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మాజీ మంత్రి పరిటాల రవి అనుచరులు అయిన పోతుల సునీత, ఆమె భర్త పోతుల సురేష్ మావోయిస్టు రాజకీయాల నుంచి టిడిపిలో చేరారు. తెలుగుదేశం పార్టీ ఆమెను ఎమ్మెల్యేల కోటాలో 2017లో ఎమ్మెల్సీని చేసింది. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా ఆమె ఓటు వేశారు. ఆ తర్వాత ఆమె టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు. టిడిపి నుండి వచ్చిన ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకుని వైసిపి తరపున తిరిగి ఎన్నికయ్యారు.