స్వతంత్ర వెబ్ డెస్క్: రాజకీయ నాయకుల వాగ్దానాలకు, వారి హామీలకు ఎలాంటి హద్దు ఉండదు. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను ప్రలోభ పెట్టడానికి రకరకాల హామీలు ఇస్తుంటారు నాయకులు. ఎన్నికలు ఉన్న లేకపోయినా పలువురు రాజకీయ నాయకులు చేసే వింత వాగ్దానాలు, హామీలకు ఢోకా ఉండదు. ఇదే తరహాలో ఎవరు చేయని వాగ్దనం చేసి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నాడు రాజకీయ నాయకుడు, తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్. ఇంతకీ ఆయన ఏమి వాగ్దానం చేసాడో చూడండి.
తమిళనాడులో ఇప్పట్లో ఎలక్షన్స్ లేకపోయినా సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ తాజాగా ప్రజలకు ఓ వింత హామీ ఇచ్చారు. ఒకప్పటి స్టార్ హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్నారు నటుడు శరత్ కుమార్. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ శరత్ కుమార్ బిజీగానే గడుపుతున్నారు. ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ ఆల్ ఇండియా సమత్తువ మక్క కట్చి. గతంలో శరత్ కుమార్ ఎమ్మెల్యేగా, రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. తమిళనాడు ఎన్నికల్లో తన పార్టీ తరపున కూడా పోటీ చేసారు శరత్ కుమార్.
ఇదంతా బాగానే ఉన్న తాజాగా తన పార్టీ ఆల్ ఇండియా సమత్తువ మక్క కట్చి వార్షిక మహాసభల్లో ఆయన చేసిన వాగ్దానం కొంచెం వింతగాను, కొత్తగానూ అనిపించింది. మధురైలో జరిగిన ఈ వార్షిక మహాసభలను ఉద్దేశించి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొనగా వారిని ఉద్దేశించి రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను. ఆదాయం కోసం మద్యపానాన్ని నమ్ముకోను అని అన్నారు. అలాగే.. నాకు ప్రస్తుతం 70 ఏళ్ళు వస్తున్నా ఇంకా 25 ఏళ్ళ యువకుడిలాగే జీవిస్తున్నాను. 150 ఏళ్ళు నేను జీవించగలను. అందుకు నేను ఒక ట్రిక్ నేర్చుకున్నాను. తమిళనాడు ప్రజలు నన్ను సీఎంని చేస్తే ప్రజలంతా 150 ఏళ్ళు ఎలా బతకాలో ట్రిక్ చెప్తాను అని అన్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా సమత్తువ మక్క కట్చి పార్టీ సభ్యులను గెలిపించి నన్ను సీఎంని చేయండి అని ప్రార్థించారు.