తమిళనాడు సీఎం విజయ్‌ని సినీ నటి సమంత కలిశారు. జూన్ 19న ఆమె నటించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె మర్యాదపూర్వకంగా సీఎం విజయ్‌ను కలిశారు. అనంతరం దీనికి సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఆమె ఇలా రాసుకొచ్చారు. “ఈ రోజు నేను చెన్నైలో అడుగుపెట్టిన క్షణం నుంచే నాకు సంతోషం కలిగింది. ఎందుకంటే నేను మన ముఖ్యమంత్రిని కలవబోతున్నాను. విజయ్ సర్ కేవలం తెరపై హీరోగా మాత్రమే ఉండేందుకు పుట్టలేదని నేను ఎప్పుడూ భావించేదాన్ని. ఆయనలోని శక్తి, ఆయన వ్యక్తిత్వం, ప్రజలు ఆయనకు ఇచ్చే స్పందన చూస్తే.. ఆయన మరింత గొప్ప బాధ్యత కోసం పుట్టిన వ్యక్తిలా అనిపించేవారు.”
ఆమె ఇంకా మాట్లాడుతూ, “నన్ను అత్యంత ప్రేరేపించేది , పూర్తిగా కొత్త రంగంలోకి అడుగుపెట్టడానికి కావాల్సిన ధైర్యం ఇచ్చింది. ఇప్పటికే మీరు సాధించిన విజయాలను వెనక్కి వదిలి, ఎంతో పెద్ద సవాళ్లు ఉన్న కొత్త బాధ్యతను స్వీకరించడం చిన్న విషయం కాదు. అది సులభం కాబట్టి కాదు.. సమాజంలో మార్పు తీసుకురాగలననే నమ్మకంతో తీసుకున్న నిర్ణయం. మన జీవితంలో ఏదో ఒక దశలో మనందరికీ మరింత చేయాలనే పిలుపు వస్తుంది. మన గురించి మాత్రమే కాకుండా, సమాజానికి ఎలా ఉపయోగపడగలమని ఆలోచించే సమయం వస్తుంది. అయితే ఆ పిలుపుకు స్పందించే వారు మాత్రం చాలా కొద్దిమంది మాత్రమే.” అంటూ రాసుకొచ్చారు.


