మూవీ: రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ
కథ: యుగో సాకో
దర్శకత్వం: కైచీ ససాకీ, రామ్మోహన్
నిర్మాత: అర్జున్ అగర్వాల్
క్రియేటివ్ పార్ట్‌నర్: వీ విజయేంద్ర ప్రసాద్
బ్యానర్స్: గీక్ పిక్చర్స్ ఇండియా, ఏఏ ఫిల్మ్స్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 24/01/2025
మహా కవి వాల్మికీ రచించిన రామాయణం యుగాలు మారినా.. తరాలు మారినా.. ఎప్పటికీ నిత్య నూతనం. శ్రీరాముడి జీవిత చరిత్రను ఎన్ని విధాలుగా చెప్పినా కొత్తగా ఉంటూనే ఉంటుంది. రామాయణ కథను ఎన్నిసార్లు విన్నా ఏదో కొత్త అంశం మానవాళికి కొత్త స్పూర్తిని అందిస్తుంది. ఈ ఇతిహాసాన్ని ఎన్నిసార్లు తెరపై చూపించినా అందులో కొత్తదనాన్ని వెతుక్కొని మరీ ప్రేక్షకులు చూస్తుంటారు. రాముడి జీవితం ఎల్లప్పటికీ అందరికి ఆదర్శప్రాయమే. అలాంటి పురాణగాథను నేటి తరం ప్రేక్షకులకు అందించాలనే కృత నిశ్చయంతో ఇప్పుడు ఈ కథను యానిమేటెడ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా’ పేరుతో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో 4కే వెర్షన్‌లో యానిమేటెడ్ చిత్రాన్ని రెడీ చేశారు.
1993లో ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా’ యానిమేటెడ్ చిత్రాన్ని రూపొందించారు. 24వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో దీన్ని ప్రదర్శించారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడు థియేటర్‌లలో ప్రదర్శించలేకపోయారు. 2000 సంవత్సరంలో టీవీలో దీన్ని టెలికాస్ట్ చేయగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. దీంతో దీని 4కే వెర్షన్‌ను సిద్ధం చేసి ఇన్నేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గీక్ పిక్చర్స్‌ఇండియా, ఏఏ ఫిల్మ్స్ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. రామ్ మోహన్, యుగో సాకో దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ చిత్రానికి విజయేంద్రప్రసాద్ రైటర్‌గా వర్క్ చేశారు. వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం ఎలా ఉంది? ఈ కథలో కొత్తగా చెప్పిన అంశాలు ఏంటి అనేది రివ్యూలో తెలుసుకుందాం…
కథ:
సాధారణంగా వాల్మీకి రామాయణం అందరికీ తెలిసిందే. రామాయణం కథ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయోధ్యలో రాముడి జననం, మిథిలా నగరంలో సీతా పరిణయం, అరణ్యవాసంలో పంచవటిలో సీతారామ లక్ష్మణుల వనవాసం, సీతాపహరణం, రామ, రావణ యుద్దం, లంకలోని అశోకవనంలో సీతకు విముక్తి లాంటి అంశాలతో ఈ సినిమాను కార్టూన్ చిత్రంగా తెరకెక్కించారు. దశరథుడి కథ, రాముడి జననం, విశ్వామిత్రుని యజ్ఞరక్షణ, సీతా కళ్యాణం, వనవాసం, సీత అపహరణ, హనుమంతుడి సాహసాలు, రామ-రావణ యుద్ధం, చివరగా రాముని పట్టాభిషేకం.. ఇలా కథ క్రమపద్ధతిలో సాగుతుంది.
విశ్లేషణ:
రామాయణ కథ ఎంతసార్లు చూసినా, ఎన్నిసార్లు విన్నా మనకు ఎంతో ఆనందాన్ని, తృప్తి ఇస్తుంది. ఇక ఈ సినిమా కథ, ఇందులో భావోద్వేగాలు బాగున్నాయి.. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. యానిమేషన్ అద్భుతంగా ఉంది, ప్రతి సన్నివేశం విజువల్ ఫీస్ట్‌గా అనిపిస్తుంది. హనుమంతుడి పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం, ఎమోషన్ మరింత ఆకట్టుకుంటాయి. తెలుగు డబ్బింగ్ బాగా ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల ఓవర్ డ్రమాటిక్‌గా అనిపిస్తుంది. ఇక పాటల విషయానికొస్తే, ఈ సినిమాలో హిందీ వెర్షన్ పాటలనే ఉంచారు. తెలుగులో ఉంటే బాగుండనిపిస్తుంది.
ఈ సినిమా కోసం సుమారుగా 450 మంది ఆర్టిస్టులు పనిచేయగా.. సుమారుగా 1 లక్షలకు పైగా హ్యాండ్ డ్రాయింగ్స్‌ను చిత్రించారు. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రచించిన రామచరిత మానస్, కంబన్ రూపొందించిన రామావతారం నుంచి స్పూర్తి పొంది ఈ సినిమాను రూపొందించారు. కార్టూన్ వర్క్ పరంగా ఈ సినిమాను అద్బుతంగా తీర్చి దిద్దారు. క్వాలిటీ పరంగా మంచి అవుట్‌పుట్ తీసుకు రావడంలో వారి కృషి అభినందనీయం. టెక్నికల్‌గా చాలా సౌండ్‌గా, రిచ్‌గా 4K టెక్నాలజీలో అందించారు. క్వాలిటీ పరంగా భారీగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫీల్‌ను అందించారనే చెప్పాలి. కాకపోతే తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ విషయంలో మరింత దృష్టి పెట్టి ఉంటే.. నిజంగానే కార్టూన్ వెర్షన్‌లో మాస్టర్ పీస్ అయి ఉండేదనిపించింది.
సాంకేతిక విశ్లేషణ:
తెలుగు డబ్బింగ్ బాగున్నా కొన్ని సీన్స్ లో మాత్రం మరీ ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తుంది. జపాన్ యానిమే సినిమాలు యానిమేషన్ అద్భుతంగా ఉంటుందని తెలిసిందే. ఈ రామాయణం కూడా యానిమేషన్ ఎక్కడా వేలెత్తి చిన్న తప్పు కూడా చూపించలేని విధంగా చాలా బాగా డిజైన్ చేశారు. ఇదంతా 1993 లోనే ఇంత అద్భుతంగా చేశారు. అప్పట్లోనే ఈ సినిమాకు 450 మంది వరకు సాంకేతిక నిపుణులు యానిమేషన్ కోసం పనిచేసారు. 1993 లో తీసినా ఇప్పుడు 4K HD క్వాలిటీ అనుగుణంగా సినిమా పిక్చరైజేషన్ చాలా క్లారిటీగా ఉండేలా మార్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. పక్షుల కిలకిలారావాలు, జంతువుల అరుపులు, సముద్రపు అలలు.. ఇలాంటివన్నీ కూడా చాలా సహజంగా రికార్డ్ చేశారు. పాటలు తెలుగులో హిందీ వర్షన్ వినిపించిన అవినడానికి చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే కూడా కథ మనకు తెలిసిన వరుస క్రమంలోనే తీసుకెళ్లారు.
సారాంశం:
మనకు తెలిసిన రామాయణాన్ని మరింత అద్భుతంగా పిల్లలు ఇష్టంగా చూసే విధంగా ‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ను రూపొందించారు. కుటుంబ సమేతంగా పిల్లలతో కలిసి చూడదగిన చిత్రం ఈ రామాయణ.