జమ్ముకశ్మీర్ రాజౌరీలోని బుధాల్ గ్రామం. ఆ పేరు వింటేనే జనంలో వణుకు పుడుతోంది. నెలన్నర వ్యవధిలో 17 మంది అనూహ్య రీతిలో మృతి చెందడమే ఇందుకు కారణం. ఎందుకు చనిపోయారో ఎవరికీ తెలియడం లేదు. ఇప్పటికీ కారణాలు వెతుకుతూనే ఉన్నారు. గ్రామ ప్రజలకు అక్కడ ఉండాలంటేనే భయం వేస్తోంది. ఈ మిస్టరీ డెత్స్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.
11 మందితో కూడిన బృందం ఈ మిస్టరీ మరణాలపై దర్యాప్తు చేస్తోంది. తాజాగా హెల్త్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మరణాలు న్యూరోటాక్సిన్స్ వల్ల జరిగాయని అంటున్నారు.
బాధితులందరిలో ఒకే రకమైన మెడికల్ కండిషన్ కనిపిస్తుందని చెప్పారు. మెదడు వాపు లేదా ఎడెమా అని రాజౌరి జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏఎస్ భాటియా అంటున్నారు.
బాధితుల శాంపిల్స్‌లో ఎటువంటి బ్యాక్టీరియా, వైరస్ గుర్తించలేదని ఇప్పటికే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. వీటికి అంటువ్యాధి కారణం కాదని అన్నారు. కొన్ని విషపూరిత పదార్ధాలను గుర్తించినట్టు వివరించారు. ఇతర కోణాలను కూడా వదలడం లేదని.. ఏదైనా కుట్ర ఉందని తేలితే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని కూడా అన్నారు.
బాధితుల శాంపిల్స్‌ను దేశంలోని టాప్ లేబరేటరీ అయిన పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) , నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించగా… మెదడు దెబ్బతినడానికి కారణమయ్యే న్యూరోటాక్సిన్‌ల ఉనికిని గుర్తించినట్టు డాక్టర్ భాటియా విశ్లేషించారు.
మెదడు దెబ్బతిన్నట్టు గుర్తించిన రోగులకు వ్యాధి తగ్గించే ప్రయత్నం చేస్తామని.. సీరియస్ బ్రెయిన్ డ్యామేజ్ ఉన్న రోగిని సాధారణ స్థితికి తీసుకురావడం కష్టమని డాక్టర్ భాటియా అంటున్నారు.
కంటైన్మెంట్ జోన్.. క్వారంటైన్
గత డిసెంబర్ ఆరంభం నుంచి రాజౌరీ గ్రామం తెలియని అనారోగ్య పరిస్థితులతో పోరాడుతోంది. మూడు కుటుంబాల నుండి 14 మంది పిల్లలతో సహా 17 మంది చనిపోయారు. మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయనే దానిపై జవాబు కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సహా ఆరుగురు అనారోగ్యానికి గురయ్యారు. వారిని రాజౌరీలోని జీఎంసీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
గ్రామ ప్రజలు ఆందోళన చెందకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దాదాపు 200 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. బాధిత కుటుంబాలతో తరచూ కలుస్తుండే వారితో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని క్వారంటైన్‌కు తరలించారు. ఆయా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత, సౌకర్యాలతో వీరిని అందులో ఉంచారు.
బుధాల్ గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. మూడు జోన్‌లుగా విభజించారు. కంటైన్‌మెంట్ జోన్ 1.. మరణాలు సంభవించిన అన్ని కుటుంబాలు దీని కిందకి వస్తాయి. బాధిత కుటుంబాల నివాసాలు సీల్ చేస్తారు.
బాధిత కుటుంబాల సన్నిహితులుగా గుర్తించిన అన్ని కుటుంబాలకు చెందిన వ్యక్తుల నివాసాలు కంటైన్‌మెంట్ జోన్ 2 కిందకు వస్తాయి. వీరి ఆరోగ్య పరిస్థితులను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
కంటైన్‌మెంట్ జోన్ 1,2 పోగా గ్రామంలో మిగిలిన అన్ని నివాసాలు కంటైన్‌మెంట్ జోన్ 3 పరిధిలోకి వస్తాయి. ఇక్కడి ప్రజలు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారో అధికారులు పర్యవేక్షిస్తుంటారు. గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ, ప్రైవేటు సమావేశాలు నిర్వహించకూడదు. బాధిత కుటుంబాలు, వారి సన్నిహితులు ప్రభుత్వ అధికారులు అందించే ఆహారం మాత్రమే తీసుకోవాలి. కాగా, ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకొనేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.