స్వతంత్ర, వెబ్ డెస్క్: ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, కిడ్నీ మాఫియా ఇలా రకరకాల మాఫియాల గురించి వినే ఉంటాం. కానీ కర్ణాటక రాజధాని బెంగళూరులో కొత్త రకం మాఫియా పుట్టుకొచ్చింది. అదే పంక్చర్ మాఫియా. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. నగరంలో ఓ పంక్చర్ దుకాణం ఉంటే దానికి ఒక కిలోమీటర్ పరిధిలోని రోడ్లు మీద చిన్న మేకులు, తీగలను కొందరు దుండగులు పడేస్తారు. వాహనాలపై వెళ్తున్న వారు గమనించక వాటిని తొక్కేస్తారు.
ఇంకేముంది అవి గుచ్చుకోగానే టైర్లు, ట్యూబులు పంక్చర్ అవుతాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లో వారు అక్కడి పంక్చర్ షాపుకు వెళ్లాలి. ఇలా అందినకాడికి దోచుకుంటున్నారు ఈ మాఫియా సభ్యులు. ఇది గమనించిన పోలీసులు రహదారులపై పడి ఉన్న మేకులు, చువ్వలు తొలగిస్తూ వాహనదారులకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఈ మాఫియా సభ్యులను అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. అయితే ఈ రోడ్లపై సీసీ కెమెరాలు పెడితే వీరి ఆగడాలకు చెక్ పెట్టవచ్చని స్థానికులు చెబుతున్నారు.