దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన నీట్ యూజీ-2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ — NTA రద్దు చేసింది. రాజస్థాన్‌లో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 3వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించిన NEET UG-2026 పరీక్షలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజస్థాన్‌లో పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వైరల్ అయిందన్న వార్తలు కలకలం రేపాయి.
దీంతో వెంటనే అప్రమత్తమైన NTA… పరీక్ష నిర్వహణపై అత్యవసర సమీక్ష చేపట్టింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సాంకేతిక నివేదికలు, దర్యాప్తు సంస్థల ప్రాథమిక సమాచారం ఆధారంగా పరీక్షను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అలాగే త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని NTA స్పష్టం చేసింది. ఇప్పటికే పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ పరీక్ష ఫీజును తిరిగి చెల్లిస్తామని తెలిపింది.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్ష కావడంతో ఈ నిర్ణయం పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటికే పరీక్ష కోసం ఏడాది పాటు కష్టపడి సిద్ధమైన విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఇక పేపర్ లీక్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. NEET ప్రశ్నాపత్రం లీక్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ — CBIకి అప్పగించారు. ఈ కేసులో పలు కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది.
ప్రశ్నాపత్రం ఎలా బయటకు వచ్చింది? ఎవరు లీక్ చేశారు? పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలు జరిగాయి? అనే అంశాలపై సీబీఐ విచారణ చేపట్టనుంది.
ఈ నెల 3న నిర్వహించిన నీట్ పరీక్షలో కెమిస్ట్రీ విభాగానికి సంబంధించిన 120కి పైగా ప్రశ్నలు ముందుగానే లీక్ అయినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సాల్ వెల్లడించారు.
దర్యాప్తులో భాగంగా అధికారులు గుర్తించిన ఒక ప్రాక్టీస్ మెటీరియల్‌లోని ప్రశ్నలు అసలు నీట్ ప్రశ్నాపత్రంలోని సుమారు 600 మార్కుల ప్రశ్నలతో చాలా వరకు సరిపోలినట్లు తెలిపారు. ముఖ్యంగా కొన్ని ప్రశ్నల జవాబుల క్రమం కూడా యథాతథంగా ఉండటంతో పేపర్ లీక్ ఆరోపణలు మరింత బలపడుతున్నాయి.
ఈ ప్రాక్టీస్ మెటీరియల్ పరీక్షకు దాదాపు 42 గంటల ముందే రాజస్థాన్‌లోని సికార్ ప్రాంతంలో వాట్సాప్ ద్వారా చక్కర్లు కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో ఈ మెటీరియల్ కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థి వద్ద నుంచి బయటకు వచ్చినట్లు వెల్లడైంది.
ఆ విద్యార్థి ఈ నెల 1న సికార్‌లో నివసిస్తున్న తన స్నేహితుడికి ఈ ప్రశ్నల మెటీరియల్‌ను అందించాడని, అనంతరం అది కోచింగ్ సెంటర్లు, పీజీ హాస్టళ్లు, కెరీర్ కౌన్సిలర్లు, అలాగే పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల మధ్య విస్తృతంగా వ్యాపించిందని అధికారులు తెలిపారు.
ఈ మెటీరియల్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలకు చెందిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రశ్నాపత్రాలను కొందరు విద్యార్థులకు రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. పరీక్షకు ముందుగానే కొందరి నుంచి రూ.30 వేలకుపైగా అడ్వాన్స్‌గా వసూలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై రాజస్థాన్ పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేపర్ లీక్‌లో మరెవరి ప్రమేయం ఉందనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.


