మంచు ఫ్యామిలీలో గొడవలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ నెల 8న మొదలైన మంచు ఫ్యామిలీ ఇష్యూ డేలీ సీరియల్‌ని తలపిస్తోంది. మనోజ్ తనపై దాడి చేశాడని మోహన్‌బాబు ఫిర్యాదు చేయగా… తండ్రే తనను కొట్టాడని డయల్ 100కి ఫోన్ చేసి చెప్పాడట మంచు మనోజ్. నాటి నుంచి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నారు. విదేశాల్లో ఉన్న మంచు విష్ణు తిరిగి వచ్చిన తర్వాత గొడవ సద్దుమణుగుతుందనుకున్నారు… కానీ ఆయన వచ్చాకే ఇంకా తీవ్రం అయింది. మనోజ్ బౌన్సర్లను ఇంట్లో నుంచి గెంటి వేయడం… తల్లి పుట్టిన రోజున జనరేటర్‌లో చక్కెర పోసి చంపాలని చూస్తున్నారంటూ మనోజ్ చేసిన ఆరోపణలతో ఫ్యామిలీ రచ్చ తారాస్థాయికి తేరింది.
తాజాగా మంచు విష్ణుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి వివాదం మొదలైంది. మంచు విష్ణుపై పహాడిషరీఫ్ పోలీసులకు తన తమ్ముడు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తన సోదరుడు మంచు విష్ణు నుంచి ప్రాణహాని ఉందని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. విష్ణుతో పాటు ఆయన సహచరుడు వినయ్ పేరును సైతం ఫిర్యాదులో ప్రస్తావించారు. మొత్తంగా 7 అంశాలను ప్రస్తావిస్తూ మనోజ్ తన కంప్లైంట్‌ను ఆన్లైన్లో పంపినట్లు తెలుస్తోంది. ఉండడానికి ఇల్లు లేకుండాచేయడంతోపాటు భౌతిక దాడులు… వాహనాల్లో చక్కెర పోయడం వంటి ఘటనలతో మనోజ్ తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నాడు. ఈ క్రమంలో తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మంచు కుటుంబ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
మోహన్ బాబు, మంచు విష్ణుతో మనోజ్‌కు తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జర్నలిస్టుల దాడిపై పోలీసులు ఏ క్షణమైనా మోహన్ బాబును అరెస్ట్ చేసే ఆస్కారం ఉంది. రెండు, మూడు రోజుల్లో గొడవలు సద్దుమణుగుతాయని భావించినా… మంచు కుటుంబం గొడవల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. గత కొంతకాలంగా మోహన్‌బాబు కుటుంబం వివాదాలతో సతమతమవుతోంది. వివాదాలు మనోజ్‌తో ఈ మధ్య వెలుగులోకి వచ్చాయి. ఆస్తి పంపకాల్లో ఈ గొడవలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగానే మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. జల్ పల్లిలోని నివాసం వద్ద కంట్రోల్ తప్పి ఒక మీడియా ప్రతినిధిపై మైక్ తీసుకుని దాడికి పాల్పడ్డారు మోహన్ బాబు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై సీరియస్ అయిన పోలీసులు… మోహన్ బాబుపై హత్యాయత్నం కింద కేసును నమోదు చేశారు. ఈ కేసులో మోహన్ బాబును ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోరారు. విచారించిన హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉన్నట్లు ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.