23.7 C
Hyderabad
Tuesday, March 25, 2025
spot_img

జాతీయ భద్రతా దినోత్సవం మార్చి 4… వేడుకలు సరే.. మరి ఆచరణ మాటో…?

భద్రం బీ కేర్ ఫుల్.. అంటూ నోటి నుంచి మాట వచ్చినా, పాట వచ్చినా…. అది జాగ్రత్త చర్యలు పాటించడం గురించే కదా..! మార్చి నాలుగో తేది.. ఏమిటి దీని ప్రత్యేకత.. ఈ రోజు జాతీయ భద్రతా దినోత్సవం. భద్రతా వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు.. ఎవరి ఎన్ని నిర్వహించినా… జాతీయ భద్రతా దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడ ఆనవాయితీగా వస్తోంది. అయితే, పండగో, పబ్బమో, వేడుకో… ఎందుకు నిర్వహించుకుంటాం. చెడ్డపై మంచి విజయమని, మంచిని పెంచి చెడ్డను తృంచి.. అందరు అన్నింటా ఏక మాటపై నిలిచి, ఏక బాటపై నడిచి.. ఒకరి కోసం అందరూ.. అందరి కోసం ఒకరు అనే రీతిలో పాటు పడి..సమాజం అంతా సుఖ సంతోషాలతో విరాజిల్లాలని ఈ వేడుకలు చేసుకుంటాం. ఇక భద్రతా దినోత్సవం అంటే.. ప్రమాదం అనే పదానికి తావులేకుండా..జాగ్రత అనే ముందస్తు చర్యలు తీసుకుని.. సుఖమయ జీవనం అనే బాటలో వెళ్లాలని ఈ వేడుకలు చేసుకుంటాం. అయితే, ఒకరోజు వేడుకలు చేసేసుకుని..మిగిలిన రోజులు భద్రతను గాలికొదిలేస్తే దాని వల్ల ప్రయోజనం ఏమిటి..?

నిండు ప్రాణాలు నిష్కారణంగా గాల్లో కలిసిపోతున్నాయి. ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు, టన్నెల్స్ లో కప్పులు కూలడాలు, కొండ చరియలు విరగడాలు, రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, జల ప్రమాదాలు, కాలుష్య కారక ప్రమాదాలు…ఇలా ఎన్నో ప్రమాదాలు. ప్రమాదం అనే మాటలోనే ఆకస్మికం ధ్వనిస్తోంది. ఆకస్మిక సంఘటనల్లో అధికశాతం దురదృష్ట ఘటనలే ఉంటున్నాయి. అజాగ్రత్త, అలసత్వం, నిర్లక్ష్యవైఖరి.. తదితర అవాంఛనీయ చర్యలు సాధారణంగా ప్రమాదాలకు హేతువు అవుతున్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసమయంలో ప్రమాదం ప్రాణాలు తీసేస్తోంది. అయితే, అన్ని జాగ్రత్తలు అంటే…ఈ కేర్ ఫుల్ నెస్ .. అందరూ తీసుకోవాలి. అన్ని భద్రత, రక్షణా చర్యలు తీసుకున్నా ప్రమాదాల్లో కొందరు అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ర్యాష్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్ తో ఏ వదరుబోతో, పొగరుబోతో..ఏ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఒళ్లుమీద తెలియకుండా వంద మైళ్ల వేగంతో వెళ్లి ప్రమాదానికి కారణం అయితే… ఆ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకుంటాడు. ఎందరి ప్రాణాలో తీసేస్తాడు. ఫ్యాక్టరీ కార్మికుల్లో 99 శాతం మంది అత్యంత సమర్థవంతంగా, భద్రతా చర్యలు సంపూర్ణంగా పాటిస్తూ… విధులు నిర్వహించినా, ఒకరో ఇద్దరో రెక్లెస్ గా ప్రవర్తిసే. ఆ ప్రమాదం అందరికి చుట్టుకుంటుంది. ఎందరో అమాయకులు తమ నిండు ప్రాణాలను కోల్పోతున్నారు.

నిన్నటికి నిన్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కేనాల్.. ఎస్ ల్ బీ సీ టన్నెల్ ప్రమాదం ఎనిమిది మందిని పొట్టను పెట్టుకోలేదా…! ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారణం ఎవరు..? సేఫ్టే మెజర్స్ ఏమయ్యాయి. దిన దిన గండం…ఎన్నేళ్లో ఆయుష్షుగా ఉండే ఉద్యోగాల్లో భద్రతా చర్యలు, రక్షణ చర్యలు ఎంత పకడ్బందీగా ఉండాలి. భయంకర ప్రమాదాలు ఒకవేళ సంభవిస్తే.. అందులోంచి బయటపడి కాపడబడడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమయ్యాయి. ఆకాశంలో లోహ విహంగంలో ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు సంభవిస్తే.. పారాచూట్లు, సేఫ్టీ ఏపారేటస్ తో ప్రాణం నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు ఉంటాయి. ఓడల్లోనో, బోట్లలోనో జలప్రాంత ప్రయాణాలు చేసే టప్పుడు సేఫ్టీ జాకెట్లు, ఇతర ఏపరేటస్ ఉంటాయి. అప్పుడప్పుడు సాగించే ఈ రిస్కీ ప్రయాణాలకే ఇన్ని జాగ్రత్తలు ఉన్నప్పుడు.. నిత్యం మృత్యువును ఒళ్లో పెట్టుకుని గనుల్లో, టన్నెల్స్ లో విధులు నిర్వహించే వారి ప్రాణాలపై ఎంత శ్రద్ధతీసుకోవాల్సి ఉంటుంది.

ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్.. అనే విషయాన్ని ఏ పెద్దలు పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగాక ఒకళ్ల మీద ఒకళ్లు… మీది తప్పంటే, మీది తప్పని కారాలు, మిరియాలు నూరుకోవడం… నిండు ప్రాణాలు నిష్కారణంగా కోల్పోయినవారికి ఆత్మశాంతి కలగాలని సంతాప సభలు పెట్టడం, మృతుల కుటుంబీకులుకు సానుభూతి తెలపడం, అన్నివిధాల మృతుల కుటుంబీకులను ఆదుకుంటామని తొలుత హామీలు గుప్పించడం, ఆనక పదో పరకో వారి చేతిలో పెట్టి చేతులు దులిపేసుకోవడం.. ప్రస్తుత సమాజంలో పాలకులు, అధికారుల తీరు ఈ రీతిన సాగడం అత్యంత శోచనీయం అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రాణాలు పణంగా పెట్టి త్రికరణశుద్ధిగా విధులు నిర్వహిస్తున్న శ్రామికులు, ఒక మూల అత్యంత భయంకర ప్రమాదానికి లోనైతే.. ఈ ఘటనకు మీరంటే, మీరు కారణమని అధికార పక్షాలు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. పాలక పక్ష, విపక్షాల ఈ తీరుపై ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

క్లిష్ట సమయంలో కార్మికులు దిక్కుతోచని స్థితిలో టన్నెల్ లో చిక్కుకున్నప్పుడు.. ఎస్ ఎల్ బీసీ టన్నెల్ ను అన్ని మీటర్లే తవ్వి, మిగిలినది ఎందుకు వదిలేశారని, అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే దీనిని ఎందుకు పెండింగ్ లో పెట్టారని, తక్కువ లాభం వస్తుందనా అని ప్రభుత్వ పెద్దలు ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు చేయడానికి సర్కారు పాలకులకు అదేనా సమయం…. దయనీయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న కార్మికుల ప్రాణాలు కాపాడ్డానికి ప్రయత్నం చేయడం తప్ప, మరిదేనిమీద ధ్యాస ఉండకూడని సమయంలో సర్కారు సారులు ఈ విమర్శలు చేయడం ఏం సబబు అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలకుల అలక్ష్యం, చిత్తశుద్ధి లోపం, ఇదంతా కాంగ్రెస్ పాపం అంటూ రెస్క్యూ ఆపరేషన్ మీద, పాలక పెద్దల మీద బీఆర్ఎస్ సారులు నిప్పులు జరిగారు. ఇంత ప్రమాదం జరిగినా సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలికి వెళ్లలేదని, ఎన్నికల ప్రచారాలు సాగించారని.. ఏవేవో మాటలు విపక్ష నేతలు అంటుండగానే.. ఆయన టన్నెల్ లోకి దిగి.. అక్కడి పరిస్థితులు అన్ని అడిగి తెలుసుకున్నారు. సమయం, సందర్భం, మంచి, మర్యాదలను గాలికొదిలేసి..ఎప్పుడు పడితే అప్పుడు నేతల మాటల యుద్ధాలు, విరుచుకుపడడాలపై ప్రజలు అసహనం, అసహ్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఆకస్మిక పరిణామం, అనుకోని అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు.. జరగాల్సిన కార్యక్రమం, భవితలో ఈ తరహా దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి సమష్టి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల ముందే రాజకీయాలు.. ఎన్నికలయ్యాక సైతం…ఎన్నేళ్లపాటు ఈ దుమ్మెతి పోసుకునే పద్దతులు కొనసాగిస్తారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వాళ్లు, వీళ్లు.. వీళ్లు, వాళ్లు…లేకుంటే వాళ్లే, వీళ్లు.. ఎవళ్లో ఒకళ్లు పాలక వర్గం, మరొకరు విపక్షంలో ఉంటారు. అప్పుడు అలా చేశారు.. ఇప్పుడు మేమేమి చేయలేకపోతున్నాం.. అంటూ ఎన్నాళ్లు అధికార పక్షాలు కాలం గడుపుతారు..? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏం అమలు చేశారు… పాలక పగ్గాలు చేపట్టి మీరు చేసిన నిర్వాకం ఏమిటి అని విపక్షాలు.. ఎంతసేపు.. ఈ గోలతోనే రోజులు గడిచిపోతుంటే.. ఇక అభివృద్ది, సంక్షేమాలు ఏం ఉంటాయి. సేఫ్టీ పద్ధతులు, సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవానికి ఏం వీలవుతుంది. ఇవన్నీ అధికార, విపక్షాలు ఆలోచించుకుని ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దశాబ్దాల క్రితం గోదావరి జిల్లాలోని ఓ పట్టణంలోని భారీ ఎరువుల కర్మాగారంలో ఓ ఆకస్మిక ప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్ పై షెడ్డు రేకు.. భారీ వర్షాలకు పూర్తిగా నానిపోయింది. అయితే, సేఫ్టే చర్యల పరిశీలనలో ఉన్న ఆ కర్మగార సేఫ్టీ సూపర్ వైజర్, సేఫ్టే సిబ్బంది, సెక్యూరిటీ గార్డు.. ఆ రేకుపై వేరు వేరు చోట్లలో విధుల్లో నిమగ్నమయ్యారు. ఏదో సందర్భంలో.. ఒకే విషయంపై మాట్లాడిల్సిన అవసరం వచ్చి… ఆ తడిసిన రేకుల షెడ్డుపై ముగ్గురూ ఒకే చోటకు రావడంతో.. ఒక్కసారిగా ఆ రేకు కుప్పకూలి.. వారు కిందకు పడిపోయారు. సేఫ్టీ సూపర్ వైజర్, ఇద్దరు గార్డులు ప్రాణాలు కోల్పోయారు. ఇది అనుకోకుండా జరిగిన ఆకస్మిక పరిణామం. దీనిపై అందరు సంతాపం తెలిపి…మృతుల కుటుంబాలను ఆ ఫ్యాక్టరీ అన్నివిధాలా ఆదుకుందని, తదనంతరం ఎప్పుడూ ఆ తరహా ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టిందని వెల్లడైంది. ఇది ఆక్సిడెంటల్ ఈవెంట్. అలాకాక… నిర్లక్ష్య వైఖరితో ప్రవర్తించడం, దయనీయస్తితిలో కార్మికులు కొట్టుమిట్టాడుతున్నప్పుడు, నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయినప్పుడు… రాజకీయాలు, రగడలు, మాటల కొట్లాటలు చేసుకోవడం అస్సలు హర్షనీయం కాదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

భద్రత కు భద్రతకు మధ్య తేడా ఏమిటి..? ఇదేమిటి రెండు భద్రతల మధ్య తేడా ఏమిటి అనుకుంటున్నారు కదూ..! సాధారణంగా ప్రత్యక్షంగా, ఆకస్మికంగా అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా నిరోధించడానికి భద్రతా చర్యలు ముందుగా తీసుకుంటారు. దీనికి విరుద్ధంగా ఇప్పటికే జరిగిన నేర ప్రవృత్తి కార్యక్రమాలు, హింసకు ప్రతిస్పందనగా భద్రతా చర్యలు తీసుకుంటారు. ఇదే, ఈ భద్రతల మధ్య డిపరెన్స్. ప్రతి సంవత్సరం మార్చి 4 వ తేదీన సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎన్ ఎస్ సీ ఆధ్వర్యంలో జాతీయ భద్రతా దినోత్సవ వేడుకలను గత అర్థ శతాబ్దానికి పూర్వం నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ కార్యకలాపాలు, సేఫ్టీ అంశంపై వ్యాస, వక్త్తృత్వ పోటీలు, స్లోగన్స్ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రమాదాల నివారణ, భద్రతా అవగాహన పెంపుదల, భద్రతా స్పృహతో కూడిన సంస్కృతి పెంపొందించే లక్ష్యంతో ఈ సేఫ్టీ డే వేడుకలను నిర్వహిస్తున్నారు. 54 వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో చొరవ, సురక్షిత ఆరోగ్యకర పనివాతావరణం, వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రత తదితర అంశాల ప్రాధాన్యాన్ని నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హైలెట్ చేసింది.

Latest Articles

‘మ్యాడ్ స్క్వేర్’లో ‘మ్యాడ్’ని మించిన కామెడీ ఉంటుంది: మ్యాడ్ గ్యాంగ్

బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్