స్వతంత్ర వెబ్ డెస్క్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భారీ దొంగతనం జరిగింది. రూ.10 లక్షల విలువైన వజ్రాలు, పది తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. ఆ మహిళ కేకలు వేయడంతో స్టేషన్‌లోని ప్రయాణికులు, రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే, అప్పటికే దొంగ పరారయ్యాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లపోచంపల్లికి చెందిన స్రవంతి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్‌లో పనిచేస్తున్నారు. శనివారం తిరుపతి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు స్రవంతి వచ్చారు. ఈ క్రమంలో రైలు ఎక్కుతుండగా స్రవంతి చేతిలోని బ్యాగ్‌ను గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్లాడు. ఆ బ్యాగులో డైమండ్ నెక్లెస్‌తో పాటు పది తులాల బంగారం, పది లక్షల విలువైన రెండు వజ్రాలు ఉన్నాయని చెబుతూ రోధించింది. స్రవంతి ఫిర్యాదుతో రైల్వే పోలీసులు స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దొంగను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.