35.8 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థి కిడ్నాప్‌ విషాదాంతం

     ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగంలో స్థిరపడతాడని తల్లిదండ్రులు భావించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. బిడ్డ విగతజీవిగా మారాడని తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు. అమెరికాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 11 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మహ్మద్ అరాఫత్‌ కిడ్నాప్‌ ఉదంతం విషాదంగా ముగిసింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో భారతీయ విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసింది. కనిపించకుండా పోయిన అబ్దుల్‌ మహ్మద్‌ అరాఫత్‌.. విగత జీవిగా పోలీసులకు కనిపించాడు. తమ కుమారుడ్ని డ్రగ్స్‌ మాఫియా కిడ్నాప్‌ చేసిందని, కాపాడాలంటూ వేడుకున్న తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. మరోవైపు అరాఫత్‌ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాదీ విద్యార్థి మృతిని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌ ఖాతా ద్వారా ధృవీకరించింది. అతని ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు సెర్చ్‌ ఆపరేషన్‌ ద్వారా తీవ్రంగా యత్నించారని.. కనిపించకుండా పోయిన మూడు వారాల తర్వాత అతని మృతదేహాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారని చెప్పారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అబ్దుల్‌ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ ఎంబసీ ఒక సందేశం ఉంచింది.

    హైదరాబాద్‌ నాచారంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన మహ్మద్‌ సలీమ్‌ కుమారుడు అబ్దుల్‌ మహ్మద్‌ అరాఫత్‌. 2023 మేలో ఉన్నత విద్యకు అమెరికా వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువు తున్నాడు. నిత్యం ఫోన్‌లో మాట్లాడే అతను మార్చి నెల 7న తండ్రితో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడాడు. ఆ మరుసటి రోజునే అబ్దుల్‌ అదృశ్యమయ్యాడని అమెరికాలో చదివే అతడి స్నేహితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. దీనిని అబ్దుల్‌ సోదరి చూసి తల్లిదండ్రులకు చెప్పింది. అబ్దుల్‌కు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మార్చి 9న ఎంబీటీ నేత అమ్జద్‌ ఉల్లా ఖాన్‌ సాయంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. అమెరికాలోని సలీమ్‌ బంధువులు క్లీవ్‌లాండ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు.

     అబ్దుల్‌ అరాఫత్‌ చివరిసారి మార్చి 8వ తేదీన క్లీవ్‌లాండ్‌లోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కనిపించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు అక్కడి పోలీసులు సమాచారమిచ్చారు. ఇంకోవైపు రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో అబ్దుల్‌ తండ్రి మరోసారి కేంద్ర విదేశాంగ శాఖను, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. ఈలోపు.. అబ్దుల్‌ తండ్రికి కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్‌ ద్వారా ఫోన్‌కాల్‌ వచ్చింది. అబ్దుల్‌ను తాము కిడ్నాప్‌ చేశామని..1200 అమెరికా డాలర్లు వెంటనే పంపించాలని డిమాండ్‌ చేశారు. అరగంట లోపు డబ్బు పంపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కిడ్నాపర్లు బెదిరించారు. బాధిత తల్లిదండ్రులు మరోసారి కేంద్ర విదేశాంగ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే.. చివరకు ఆ తండ్రికి కన్నీళ్లే మిగిలాయి. తమ కొడుకు చనిపోయాడని తెలుసుకుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు 2024లో ఇప్పటి వరకు 11 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్