వచ్చే సంవత్సరం…ఎన్నికల సంవత్సరం…ఇక తాడోపేడో తేల్చుకుందామని జనసేనాని పవన్ కల్యాణ్ ధృడ నిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందు ఎన్నికల్లో చేసిన తప్పిదాలను మళ్లీ చేయకూడదనే సంకల్పంతో కూడా ఉన్నారు. అందుకనే పక్కా ప్రణాళికతో ఒక ఎన్నికల వాహనానికి రూపకల్పన చేశారు.
ముందుగా కొండగట్టు అంజన్న దేవాలయంలో వాహన పూజలు చేయించిన పవన్, రెండోరోజే ఏపీ బయలుదేరారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడి వద్ద వారాహికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అప్పుడే పోలీసులు మొహరించారు. పవన్ వచ్చారు. వెళ్లేవరకు టెన్షన్ గానే ఉంటుందని అంటున్నారు.

నిజానికి గతంతో పవన్ కల్యాణ్ వాహనం లేక…ఎండలో, వానలో తిరిగారు. చెట్ల కింద పడుకున్నారు. గట్ల వెంట, పుట్ల వెంట తిరిగారు. కారుపై నుంచి మాట్లాడాలంటే పెద్ద ప్రయాసగా ఉండేది. చేతిలో మైకు పట్టుకుని మాట్లాడితే దూరంగా ఉన్నవాళ్లకి వినిపించేది కాదు. అలాగే రాత్రిళ్లు అయితే గ్రామాల్లో వెలుతురు లేక, కరెంటు లేక అవస్థలు పడేవారు.


అలాగే అత్యుత్సాహం ఉన్న అభిమానులతో కూడా చాలా ఇబ్బందులున్నాయి. వారందరూ పవన్ కారుపైకి దూకుతూ ఉంటారు. ఆయన్ని తాకుతూ ఉంటారు. చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆయన చిరాకు పడకూడదు. ఇబ్బందిలా ముఖం పెట్టకూడదు. వారిని తిట్టకూడదు. మరో తెలుగు టాప్ హీరోలా ఎగిరెగిరి తన్నకూడదు. ఇన్ని అసౌకర్యాల మధ్య ఆయన ప్రసంగాలు, రాజకీయ టూర్లు ఫలప్రదం కావడం లేదని భావించి…ఇవన్నీ అందుబాటులో ఉండేలా సరికొత్త ఎన్నికల ప్రచార రథానికి రూపకల్పన చేశారు. దానిపేరే వారాహి…
ఇందులో అన్నిరకాల సెట్టింగులు ఉన్నాయి. చక్కగా వాహనంపై నుంచి మాట్లాడవచ్చు. ఒక ప్రయాణం అయిపోయిన తర్వాత కాసింత విశ్రాంతి తీసుకోవచ్చు. రాత్రిళ్లు ఎక్కడ స్టే చేసినా ఇబ్బంది లేకుండా గడపవచ్చు. ఇలాగన్నమాట.
ఈ క్రమంలో ఆయన కొండగట్టు అంజన్న ఆలయంలో పూజలు చేయించి, వాహనంపై ఎక్కి తొలిసారిగా మాట్లాడారు. ఇందులో ఆయన చెప్పిన ముఖ్యాంశం ఏమిటంటే…జనసేన తెలంగాణా నుంచి కూడా పోటీ చేస్తుందని తెలిపారు. అయితే పరిమిత సంఖ్యలో పోటీ చేస్తామని ఒక 30-40 సీట్ల మధ్య ఎమ్మెల్యే స్థానాల్లో 10 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.
కనీసం పది మంది ఎమ్మెల్యేలైనా జనసేన నుంచి ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అవసరం కొద్దీ భావసారూప్యం ఉన్న ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని అన్నారు. ఒంటరిగా గెలవలేమని అనుకున్నప్పుడు జంటగా వెళితే తప్పు లేదని అన్నారు. రాజకీయాల్లో పట్టు విడుపులు ఉండాలని తెలిపారు.

