31.2 C
Hyderabad
Thursday, April 17, 2025
spot_img

పవన్‌ను గందరగోళంలో నెట్టేసి, బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతోందా?

– కలసివస్తేనే పొత్తంటూ సోము వ్యాఖ్య
– లేకపోతే జనంతోనే పొత్తు అని స్పష్టీకరణ

– ఒంటరిపోరుకు సోము సంకేతాలు?
– పవన్‌ను బీజేపీ అనుమానిస్తోందని జనసైనికుల కన్నెర్ర
– అనుమానించే పార్టీతో ప్రయాణం ప్రమాదమంటున్న జనసైనికులు
– బీజేపీతో వెళితే నష్టమేనంటున్న జనసేన సీనియర్లు
– స్థానిక ఎన్నికల్లో సోము జిల్లాలోనే జనసేన ఎక్కువ సీట్లు గెలిచించదని విశ్లేషణ
– పవన్‌కు రోడ్‌మ్యాప్ ఇచ్చేశామని గతంలో సోము ప్రకటన
– తనకు ఢిల్లీ నుంచి రోడ్‌మ్యాప్ రాలేదన్న పవన్
– ఎవరి మాటలు నిజమో తెలియక క్యాడర్ గందరగోళం
– తాజాగా కలసివస్తేనే పొత్తని సోము మెలిక
– జనంతో పొత్తేమిటో తెలియక బీజేపీ నేతల అయోమయం

( మార్తి సుబ్రహ్మణ్యం)

‘పువ్వు’ పార్టీ.. ‘గాజుగ్లాసు’తో పొలిటికల్ గేమ్స్ ఆడుతోందా? పొత్తులపై పవన్‌ను గందరగోళంలో నెట్టేసి, సేఫ్ గేమ్ ఆడుతోందా? పవన్ జనసేనని ‘పరాయి పార్టీ’గా అనుమానిస్తోందా? పవన్ పార్టీని ఎన్నికల నాటికి పొమ్మనకుండా ఇప్పటి నుంచే పొగబెడుతోందా? అందుకే జనసేనతో పొత్తు ఉంటుందని.. బీజేపీ తన రాజకీయ తీర్మానంలో ప్రకటించలేదా? ‘కలసి వస్తే జనసేనతో పొత్తు’ అని సోము వీర్రాజు చేసిన, నర్మగర్భవ్యాఖ్య వెనుక మర్మం అదేనా? ఇంతకూ పవన్‌కు బీజేపీ రోడ్‌మ్యాప్ ఇచ్చిందా? లేదా? ఇచ్చిందని వీర్రాజు.. లేదని పవన్ చేసిన గత వ్యాఖ్యల్లో ఎవరి మాట నిజం? ఎవరి మాట అబద్ధం? జనసేనతో కటీఫ్ అవ్వాలన్న బీజేపీ నేతల ప్రయత్నాల వెనుక ఢిల్లీ ఆశీస్సులు ఉన్నాయా? లేక అవన్నీ లోకల్ నాయకత్వ వ్యక్తిగత ప్రయత్నమా? ఇదీ.. ఇప్పుడు జనసేన-బీజేపీ క్యాడర్‌లో జరుగుతున్న హాట్ టాపిక్.

‘‘రానున్న ఎన్నికల్లో మాతో కలసివస్తే జనసేనతో కలసి పోటీ చేస్తాం. లేకపోతే జనంతోనే మా పొత్తు’’ అంటూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన నర్మగర్భ వ్యాఖ్య, ఇప్పుడు జనసేన-బీజేపీ క్యాడర్‌లో గందరగోళానికి కారణమవుతోంది. అంతకుముందు.. భీమవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన రాజకీయ తీర్మానంలో.. జనసేనతో పొత్తు ఉంటుందని, ఎక్కడా స్పష్టం చేయకపోవడం చర్చనీయాంశమయింది. పైగా భావసారూప్యత ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటామని, ప్రత్యేకించి ప్రస్తావించింది. దానితో సహజంగానే, బీజేపీ-జనసేన పొత్తుపై ముందస్తుగా అనుమానపు మేఘాలు ఆవహించాయి.

తాజాగా జనసేనతో పొత్తుపై సోము చేసిన వ్యాఖ్య.. సంస్థాగతంగా జనసేనను- వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్‌ను అనుమానించి, అవమానించేవన్న ఆగ్రహం జనసైనికుల్లో వ్యక్తమవుతోంది. జీవీఎల్ వంటి అగ్రనేతలు ఒకవైపు.. జనసేనతో మాత్రమే తమ పార్టీ పొత్తు ఉంటుందని స్పష్టం చేస్తుంటే, రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు వ్యాఖ్యలు మాత్రం, అందుకు విరుద్ధంగా ఉన్నాయని జనసైనికులు కారాలు మిరియాలు నూరుతున్నారు.

వీర్రాజు వ్యాఖ్యలు పరిశీలిస్తే.. బీజేపీ పవన్‌ను నమ్మడం లేదని, నిజంగా పవన్‌పై నమ్మకం, మిత్రపక్షంపై చిత్తశుద్ధి ఉంటే.. బీజేపీ రాష్ట్ర కమిటీ రాజకీయ తీర్మానంలోనే జనసేనతో పొత్తును స్పష్టం చేసేవారని, జనసేన సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

అంత అపనమ్మకం ఉన్న బీజేపీతో కలసి ప్రయాణం చేయడం ప్రమాదమేనని, జనసైనికులు తమ నాయకత్వానికి స్పష్టం చేస్తున్నారు. వీర్రాజు మాటలు.. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుందని, జనసేన నేతలు రుసరుసలాడుతున్నారు. నిజానికి జనసేనతో పొత్తుకోసం, తొలి నుంచీ వెంపర్లాడుతోంది బీజేపీయేనని గుర్తు చేస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో పొత్తు , తమ కంటే బీజేపీకే ఎక్కువ అవసరమని స్పష్టం చేస్తున్నారు.

గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సోము వీర్రాజు సొంత కడియం సహా, తూర్పుగోదావరిలో బీజేపీ ఎక్కడా గెలవని విషయాన్ని విస్మరించకూడదని గుర్తు చేస్తున్నారు. ఆ ఎన్నికల్లో జనసేన టీడీపీతో కలసి, ఎక్కువ సీట్లు గెలిచిన విషయాన్ని విస్మరించకూడదని విశ్లేషిస్తున్నారు. బీజేపీ తమకు భారమే తప్ప వరం కాదని, తమతో పొత్తు వల్ల బీజేపీకి లాభం తప్ప, బీజేపీతో పొత్తు వల్ల తమకు నష్టమేనంటున్నారు.

బీజేపీతో పొత్తు లేకపోతే, ముస్లిం-క్రైస్తవులు జనసేనకు ఓటు వేస్తారని స్పష్టం చేస్తున్నారు. అదే బీజేపీతో కలసి పోటీ చేస్తే.. తమకు ఆ రెండు వర్గాలు దూరమవుతాయని జనసేన సీనియర్లు విశ్లేషిస్తున్నారు. దీన్ని బట్టి బీజేపీతో పొత్తు వల్ల, ఎవరికి లాభమో బేరీజు వేసుకోవాలని జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలాఉండగా.. జనసేనతో పొత్తుపై వీర్రాజు చేసిన వ్యాఖ్య అటు బీజేపీలోనూ గందరగోళం సృష్టిస్తున్నాయి. అసలు ఎన్నికలకు చాలా సమయం ఉండగా, ఇప్పటినుంచే పొత్తుల గురించి తొందరపడటం ఎందుకని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. బహుశా జనసేనను పొమ్మనలేక, పొగబెట్టే వ్యూహం అమలవుతుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కోర్ కమిటీ సమావేశాల్లో కూడా పొత్తుపై జాతీయ నాయకులు ఎలాంటి సంకేతాలు, సూచనలు ఇవ్వలేదంటున్నారు. అలాంటప్పుడు వీర్రాజు వ్యాఖ్యలు జనసేనను దూరం చేసుకోవడమేనని స్పష్టం చేస్తున్నారు. జనసేనతో కలసి పోటీ చేస్తే కనీసం కొన్ని సీట్లయినా వచ్చే అవకాశం ఉందని, లేకపోతే తమకు డిపాజిట్లు కూడా రావని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

నిజానికి ఇతర పార్టీల నుంచి చేరిన వారికి తప్ప, స్వతహాగా బీజేపీలో తొలి నుంచి ఉన్న నేతలకు పార్టీ క్యాడర్‌కు తప్ప, జనంలో పెద్ద గుర్తింపు లేదు. అయితే మీడియాలో మాత్రం, ప్రముఖంగా కనిపిస్తారు. రాష్ట్ర-జాతీయ నేతలుగా గుర్తింపు పొందిన బీజేపీ నేతల్లో ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయరు. వీరికి స్థానబలం ఉండదు. పార్టీ ఇతరులతో పొత్తు పెట్టుకోవడం వీరికి రుచించదు. ఎన్నేళ్లయినా అదే స్థానంలో ఉండేందుకు ఇష్టపడతారే తప్ప, మరొకరి రాకను సహించలేరన్నది బహిరంగ రహస్యమేనని ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎందుకంటే.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే, ఆ లాభాలు, లెక్కలు వేరు. అందుకే తొలినుంచీ బీజేపీలో పనిచేసే నేతల్లో చాలామంది, పొత్తును ఆహ్వానించరు. ఒంటరి పోటీకే మొగ్గు చూపుతారు. వీరికి కావలసిందల్లా, కేంద్రంలో పార్టీ అధికారంలో ఉంటే చాలు. వీరికి ఆర్‌ఎస్‌ఎస్ స్థానిక నాయకత్వం కూడా, మద్దతునిస్తుందనేది ఒక ప్రచారం.

ఇతర పార్టీల నుంచి చేరిన నేతలను, సంఘ్ పెద్దగా ప్రోత్సహించదన్నది మరో విమర్శ. బయట నుంచి వచ్చే నేతలపై సంఘ్, సవతిప్రేమ చూపుతుందన్నది ప్రధాన విమర్శ. వారు కేవలం తొలి నుంచీ బీజేపీలో ఉన్న వారినే, రాజకీయంగా ప్రోత్సహిస్తారన్న అపప్రధ లేకపోలేదు. అందుకే చాలామంది అగ్రనేతలు విసిగి వేసారి తమంతట తామే పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు.

నాగం జనార్దన్‌రెడ్డి, రావెల కిశోర్‌బాబు, స్వామిగౌడ్ వంటి ప్రముఖులంతా బీజేపీలో ఇమడలేకపోవడానికి కారణం ఇదేనని నేతలు విశ్లేషిస్తున్నారు. కొత్తగా వచ్చిన వారిని తమంతట తాము వెళ్లేలా చేయడంలో బీజేపీ-వారికి దన్నుగా నిలిచే సంఘ్ నిష్ణాతులన్న విమర్శలు లేకపోలేదు. ఏపీ-తెలంగాణలో ఇప్పుడు పార్టీలో ఇదే వాతావరణ నెలకొందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పదాధికారులంతా వారి స్థాయిలో, ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలని గతంలో మోదీ స్పష్టం చేశారు. అయినా దానిని పాటించే దిక్కులేదు. గతంలో కొంతమంది పోటీ చేసినా వారికి వచ్చిన ఓట్లు.. వందలు, వేలూ తప్ప.. లక్షలు దాటిన దాఖలాలు లేవు.

స్వయంగా అధ్యక్షుడు వీర్రాజు కూడా ఎన్నికల్లో ఓడి, టీడీపీతో పొత్తు పుణ్యాన ఎమ్మెల్సీగా ఎంపికయిన నాయకుడే. ఇప్పటివరకూ పార్టీలకు అధ్యక్షులుగా పనిచేసిన వారంతా, ఎమ్మెల్యే-ఎంపీగా పోటీ చేసిన గెలిచిన వారే. వీర్రాజు ఒక్కరే దీనికి మినహాయింపు. ఆయన ఏ ఎన్నికల్లోనూ గెలిచిన దాఖలాలు లేవు.

వీర్రాజు సొంత కడియం మండలంలో జనసేన మద్దతుతో టీడీపీ ఎంపీపీ అభ్యర్ధి విజయం సాధించగా, మకిలిపురం మండలంలో టీడీపీ మద్దతుతో జనసేన అభ్యర్ధి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కని విషయాన్ని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. జనసేన-టీడీపీ కలసి పోటీ చేసి, 12 స్థానాల్లో విజయం సాధించాయని విశ్లేషిస్తున్నారు. దీన్నిబట్టి ఎన్నికల్లో ఏమాత్రం క్యాడర్-జనబలం లేని బీజేపీతో పొత్తు లాభమా? నష్టమా? అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.

Latest Articles

‘మధురం’ మధురమైన విజయాన్ని అందుకోవాలి: వీవీ వినాయక్

యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్