ఐపీఎల్ 2026 మెగా ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. 70 లీగ్ మ్యాచులు, 3 కీలక మ్యాచుల తర్వాత జరిగే నేటి ఫైనల్ పోరు కోసం ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్లో గెలిచి రెండో సారీ చాంపియన్‌షిప్ పొందాలని ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. హోమ్ గ్రౌండ్‌లో గెలిచి సత్తా చాటాలని గుజరాత్ టైటాన్స్, వరుసగా రెండో సారి టైటిల్ సొంతం చేసుకోవాలని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఫైనల్ పోరులో నువ్వా నేనా అని తలపడనున్నాయి.
క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ జట్టును 92 పరుగుల తేడాతో ఓడించి ఆర్సీబీ, క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలిచి గుజరాత్ టైటాన్స్ ఫైనల్లోకి అడుగుపెట్టాయి. నేటి కీలక మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే జోస్యాలు చెప్తూ మాజీ క్రికెటర్లు వార్తల్లో నిలిచారు. ఐదేళ్ల ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ కు ఇది మూడో ఫైనల్ కావడం విశేషం. ఇక సాయంత్రం జరిగే మ్యాచ్ లో ఇరు జట్లకు గెలిచే అవకాశాలు సమానంగా ఉన్నాయని ఆస్ట్రెలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తెలిపారు. గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్‌లో ఆడుతుండటం వారికి లభించే అతిపెద్ద అడ్వాంటేజ్ అని టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉందని ఫించ్ అభిప్రాయ పడ్డారు. ఇక ఆర్సీబీ అన్ని విభాగాల్లో సమానంగా కనిపిస్తోందని, ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్‌ల ఫామ్ ఆర్సీబీకి ప్లస్ అవుతుందని ఆరోన్ ఫించ్ విశ్లేషించాడు.
వరుసగా రెండో సారి ఐపీఎల్ ఫైనల్ కు చేరిన ఛాలెంజర్స్ కు టైటాన్స్ కంటే గెలిచే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉన్నాయాని క్రికెట్ విశ్లేషకులు జోష్యం చెప్తున్నారు. గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ప్రయాణాల వల్ల అలసిపోయి ఉంటారని మాజీ క్రికెటర్ మూడీ గుర్తుచేశాడు. గుజరాత్ జట్టు మంగళవారం ధర్మశాలలో, శుక్రవారం ముల్లాన్‌పూర్‌లో మ్యాచ్‌లు ఆడి, ఇప్పుడు ఆదివారం అహ్మదాబాద్‌లో ఫైనల్ ఆడబోతోందని.. ఈ నిరంతర ప్రయాణాలతో వారిపై శారీరకంగా, మానసికంగా ఒత్తిడి ప్రభావం చూపే అవకాశం ఉందని, కాబట్టి ఆర్సీబీకే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని టామ్ మూడీ చెప్పుకొచ్చారు.


