అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్న డచ్ క్రూయిజ్ నౌక ‘ఎంవీ హోండియస్’లో వెలుగుచూసిన హంటా వైరస్ కలకలం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఐదుగురిలో వైరస్ నిర్ధారణ కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. మరో ముగ్గురిలో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ గెబ్రెయేసస్ ( Tedros Adhanom Ghebreyesus) తెలిపారు. ప్రస్తుతం ఈ నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో కానరీ దీవుల వైపు ప్రయాణిస్తోంది.
ఈ ‘ఎంవీ హోండియస్’ నౌక మార్చి నెలలో అర్జెంటీనాలోని ఉషువాయా నుంచి బయల్దేరింది. దక్షిణ అట్లాంటిక్ సముద్ర ప్రయాణం ముగించుకుని కేప్‌వెర్డే మీదుగా యూరప్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ప్రయాణం మధ్యలో పలువురు ప్రయాణికులకు జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, తీవ్ర అలసట వంటి లక్షణాలు కనిపించాయి. మొదట దీనిని సాధారణ న్యుమోనియా కేసులుగా భావించిన వైద్య సిబ్బంది, తర్వాత పరీక్షల్లో హంటా వైరస్ ఆనవాళ్లు గుర్తించారు.
WHO వివరాల ప్రకారం ఇప్పటివరకు మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. అందులో ఐదు కేసులు ప్రయోగశాల పరీక్షల్లో హంటా వైరస్‌గా నిర్ధారించబడ్డాయి. మరో మూడు కేసులు అనుమానాస్పదంగా ఉన్నాయి. మృతుల్లో ఇద్దరు డచ్ పౌరులు, ఒక జర్మన్ పౌరుడు ఉన్నట్లు సమాచారం. మొదటగా అనారోగ్యానికి గురైన 70 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ 11న నౌకలోనే మరణించాడు. అనంతరం అతని భార్య కూడా వైరస్ బారినపడి మరణించింది. మరొక ప్రయాణికుడు మే 2న ప్రాణాలు కోల్పోయాడు.
ఈ వైరస్ సాధారణంగా ఎలుకల మూత్రం, లాలాజలం, విసర్జనల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. అయితే ‘ఆండీస్ హంటా వైరస్’ అనే ఈ ప్రత్యేక రకం మనుషుల మధ్య కూడా పరిమిత స్థాయిలో వ్యాపించే సామర్థ్యం కలిగి ఉందని WHO తెలిపింది. అదే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థను మరింత అప్రమత్తం చేసింది.
నౌకలో సుమారు 150 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో బ్రిటన్, అమెరికా, స్పెయిన్, నెదర్లాండ్స్ తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారు. ఇప్పటికే పలువురిని దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్, యూరప్‌లోని ఆసుపత్రులకు తరలించారు. కొన్ని దేశాలు తమ పౌరులను గుర్తించి క్వారంటైన్‌లో ఉంచేందుకు చర్యలు ప్రారంభించాయి.
ప్రస్తుతం నౌకలో ప్రత్యేక వైద్య బృందాలు పనిచేస్తున్నాయి. WHO నిపుణులు నౌకలోకి వెళ్లి ప్రతి ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రయాణికులను కేబిన్లకే పరిమితం చేశారు. అదనంగా 2500 డయాగ్నస్టిక్ కిట్లను పలు దేశాలకు WHO పంపిస్తోంది.
అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని WHO స్పష్టం చేసింది. ఇది “మరో కోవిడ్ పరిస్థితి కాదు” అని WHO అధికారులు పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి సామర్థ్యం చాలా తక్కువగా ఉందని, కేవలం సన్నిహిత సంబంధాల ద్వారా మాత్రమే మనుషుల మధ్య వ్యాపించే అవకాశముందని వెల్లడించారు


