ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. గతంలో ఎన్నడూ లేనివిదంగా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రధాన పార్టీలు. సిట్టింగ్ సీటును కాపాడుకునే పనిలో బీఆర్‌ఎస్ ఉండగా, అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవాలన్న తపనలో హస్తం నేతలు, కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం పోటాపోటీగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకం గా ముందుకు సాగుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, బీఆర్‌ఎస్ నుంచి రాకేష్‌రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి పోటీ పడుతు న్నారు. మరోపక్క ఒకరిద్దరు స్వంత్ర అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
సాధారణ ఎన్నికలను తలపించేలా ఈ సారీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాగింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ వైరం మరింత ముదిరిన నేపథ్యంలో ఒకరిపై ఒకరు విజయం సాధించాలన్న కసిలో ఉన్నారు. మరోపక్క ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ భావిస్తుండటంతో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఎక్కడైతే ఓటర్లు అధికంగా ఉన్నారో వారిని ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు. ఇక ప్రచారం ముగియడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. ఓటర్లను నేరుగా కలిసేందుకు ప్రాధాన్యం ఇస్తూనే ఫోన్ చెయడమే కాకుండా వాయిస్ మెసేజ్‌లు పంపుతున్నారు. ఇక మరోపక్క రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పరిధిలో మొత్తం 4 లక్షల 63 వేల 839 మంది ఓటర్లు ఉండగా ఖమ్మం జిల్లా పరిధిలో మొత్తం 83 వేల 879 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 40 వేల 146 మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం మండల కేంద్రాలు, పట్టణాల్లో పోలింగ్ కేంద్రాల ను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా పరిధిలో మొత్తం 118, జిల్లా కేంద్రంలో 57 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్ అనంతరం నేరుగా బ్యాలెట్ బాక్సులను నల్లగొండ స్ట్రాంగ్‌రూంకు తరలించనున్నారు. జూన్ 5 వ తేదిన ఓట్లు లెక్కించనున్నారు.


