భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన విజయవాడలో విశ్రాంతి లేకుండా పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. చివరి ప్రాంతం వరకు వరద బాధితులకు సహాయం అందించాలని కృషి చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు అధికారులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఏడో రోజు కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే బస చేశారు ముఖ్యమంత్రి. కలెక్టరేట్‌లోనే వినాయకచవితి పూజలు నిర్వహించబోతున్నారు.
మరోవైపు వరద నష్టంపై నేడు కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపనుంది ఏపీ ప్రభుత్వం. 7 లక్షల వరకు వరద ప్రభావిత ప్రజలు ఉన్నారని అంచనా వేసింది. వరదలకు భారీ నష్టం వాటిల్లిందని భావిస్తున్న సర్కారు.. అందుకు తగ్గట్లుగా సహాయం చేయాలని కేంద్రాన్ని కోరుతోంది. దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులు, వస్తువులకు కూడా సాయం చేయాలనే ఆలోచనలో ఉంది. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలవాలనుకుంటున్నారు చంద్రబాబు. వరద నష్టం వివరాలను స్వయంగా తెలియజేయాలన్న ఆలోచనలో ఉన్నారు.