సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది భారతీయులు మృతి చెందారు. ఆ దేశం పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని తెలిపింది. భారత్‌తోని అధికారులకు సమాచారం అందించామని ఎక్స్ వేదికగా ప్రకటించింది.
సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది భారతీయులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని ఎక్స్ వేదికగా తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ పూర్తి సహకారం అందిస్తోందని వివరించారు. భారత్‌లోని అధికారులు, బాధిత కుటుంబాలతో టచ్‌లో ఉన్నామన్నారు. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు 8002440003(టోల్ ఫ్రీ), 0122614093, 0126614276, 0556122301(WhatsApp)ఏర్పాటు చేశామని జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
మరోవైపు ఈ విషాద ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. ప్రమాదంలో భారత పౌరుల మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతోన్న జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.