ప్రజా ప్రయోజనాల కోసం గత టిడిపి ప్రభుత్వం నిర్మించతలపెట్టిన వంతెనలు, ఇతర నిర్మాణాలు వైసీపీ హయాంలో పక్కనపడేశారు. వాటి నిర్మాణ పనులను జగన్ ప్రభుత్వంలో అధికారులు గాలికి వదిలేశారు. ఇదే మాదిరిగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెంలోని జల్లేరువాగుపై వంతెన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. రెండు నియోజకవర్గాలను కలిపే జల్లేరు కాలువపై నిర్మించాల్సిన వంతెన పనులు మూలనపడడంతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు.
జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెం నుండి ఎగువ ఏజెన్సీ ప్రాంతాల్లోని దాదాపు 35 గిరిజన గ్రామాలకు రాకపోకలు కొనసాగుతున్నాయి. చింతలపూడి- పోలవరం నియోజవర్గాలను కలుపుతూ ఈ కాలువ వంతెనపై నుంచి ప్రజలు రాకపోకలు సాగించాలి. ఇక్కడి నుండి ఎగువ ప్రాంతాలు వెళ్ళాలంటే ఎవరైనా జల్లేరువాగు దాటి వెళ్ళాల్సిందే. వర్షాలు కురిసి వాగు పొంగినప్పుడల్లా రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.
సమస్యను గుర్తించిన అప్పటి చింతలపూడి టీడీపీ ఎంఎల్ఏ, మంత్రి పీతల సుజాత 2018లో దాదాపు కోటి రూపాయలతో జల్లేరువాగుపై వంతెనకు శ్రీకారం చుట్టారు. దానికి టెండర్లు పిలిచి గుత్తేదారు గిరికి నిర్మాణం పని అప్పగించారు. దీనికి అప్పటి అధికారులు, పాలకులు శంకుస్థాపన చేశారు. క్రమక్రమంగా పనులు సాగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చింది. గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మధ్యలో నిలిచిపోయాయి.
తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి సహకరించలేదు. దీంతో గుత్తేదారు పనులను నిలిపివేశారు. వైసిపి ఎంఎల్ఏ ఎలిజాకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని పలువురు వాపోయారు. వరదల వల్ల ప్రతిసారీ డైవర్షన్ రహదారి కోసం వేసిన సిమెంట్ తూరలు కొట్టుకుపోతున్నాయి. వాటి కోసం ప్రతిసారీ లక్షల రూపాయలతో తాత్కాలిక రహదారి నిర్మిస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపించడం లేదు.
ఎగువ ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పుడల్లా వాగు పొంగి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని గ్రామస్తులు వాపోయారు. వాగు పొంగితే పక్కనే ఉన్న పాడి పశువులను, పొలాన్ని చూసేందుకు చుట్టూ సుమారు 15 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సి వస్తోంది. వాగు పొంగితే సుమారు 35 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. నిత్యావసర సరుకులు, మందులు రవాణాకు అంతరాయం ఏర్పడుతుంది. వాగులు పొంగిన ప్రతిసారి ఎగువ ప్రాంతాలవారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి.
గ్రామస్తులు, వాహన చోదకులకు వర్షాకాలం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ రహదారి నుండే గిరిజనుల ఆరాధ్య దైవం గుబ్బల మంగమ్మ ఆలయానికి భక్తులు వెళుతుంటారు. పలు విద్యాసంస్థల బస్సులు కూడా ఇదే మార్గంలో వెళుతుంటాయి. గతంలో పలు వాహనాలు ఈ వాగులో కొట్టుకుపోయాయని
గ్రామస్తులు చెప్పారు. ఇప్పుడైనా ఈ వంతెనను పూర్తిచేయలని గ్రామస్తులు కోరారు.