ఫ్రెషర్స్‌ను తొలగిస్తున్న ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్.. గతేడాది అక్టోబర్‌లో విధుల్లోకి తీసుకున్న ఫ్రెషర్లలో సగం మందికి ఉద్వాసన పలికినట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని మైసూరు క్యాంపస్‌లో దాదాపు 400 మంది ట్రైనీలకు లేఆఫ్‌లు ప్రకటించినట్టు ఇంగ్లీష్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. వరుసగా మూడు ఎవాల్యుయేషన్ పరీక్షల్లో ఫెయిల్ అయిన కారణం చెబుతూ వారిని తొలగిస్తున్నారట. వారిని పిలిచి మ్యూచుల్ సెపరేషన్‌పై సంతకాలు కూడా చేయించుకున్నారట. దీంతో ఉద్వాసనకు గురైన ట్రైనీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఫెయిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే పరీక్షలను చాలా కఠినంగా పెట్టారని అంటున్నారు.
వడ్డీ రేట్లను సవరించిన ఆర్‌బీఐ
రెండేళ్ల తర్వాత కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ ఎట్టకేలకు సవరించింది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దీంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగింది. మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచుతూ వస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత రెపో రేటు 6.25 శాతానికి చేరింది.
హోమ్ లోన్ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్
హోమ్‌లోన్ తీసుకున్న వినియోగదారులకు ఎట్టకేలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊరట నిచ్చింది. ఆర్‌బీఐ రెపో రేట్‌ను తగ్గించడంతో హోమ్‌లోన్ తీసుకున్న వారికి ఈఎంఐలు తగ్గనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టకుని వృద్ధికి ఊతం ఇవ్వాలన్న ఉద్దేశంతో 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గిస్తున్నట్లు తెలిపారు. తాజా నిర్ణయంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది. ఐదేళ్ల నుంచి వడ్డీ రేట్లు పెరగడం తప్ప.. తగ్గడం చూడని హోమ్‌లోన్ కస్టమర్లకు ఇది ఊరట కల్పించనుంది.
బ్రైట్‌కామ్ ప్రమోటర్లపై సెబీ కొరఢా
కంపెనీ ఆదాయాలు, లాభాలను తప్పుగా చూపినందుకు హైదరాబాద్‌కు చెందిన బ్రైట్‌కమ్ గ్రూపుపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొరఢా ఝళిపించింది. ఆన్‌లైన్, డిజిటల్ మార్కెటింగ్ కార్యకలాపాలు సాగించే బ్రైట్ కామ్ ప్రమోటర్లపై రూ.34 కోట్ల జరిమానా విధించింది. సెబీ ఆదేశాల మేరకు ప్రమోటర్ల గ్రూపులోని సురేశ్ కుమార్ రెడ్డి, విజయ్ కంచర్ల.. చోరి రూ.15 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే శ్రీనివాసరావు రూ.2 కోట్లు, కంపెనీ రూ.1 కోటి, యర్రదొద్ది రమేష్ రెడ్డి రూ.1 కోటి చొప్పున చెల్లించాలి. ఐదేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో లావాదేవీలు నిర్వహించకుండా సురేష్‌కుమార్ రెడ్డి, విజయ్ కంచర్లపై సెబీ నిషేధం విధించింది. అయిదేళ్ల పాటు కంపెనీలో కేఎంపీ (కీ మేనేజరియల్ పర్సనల్) గా వ్యవహరించరాదనీ స్పష్టం చేసింది.
నష్టాల బాటలో ఓలా
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌కు నష్టాలు కొనసాగుతున్నాయి. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మూడో త్రైమాసికంలోనూ రూ.564 కోట్ల నికర నష్టం వచ్చినట్టు తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ప్రకటించిన రూ.376 కోట్ల నష్టంతో పోలిస్తే నష్టాలు మరింత పెరిగాయి. మార్కెట్‌లో పోటీ పెరగడం.. ఆదాయాలు తగ్గుముఖం పట్టడం, సేవా లోపాలను సరిదిద్దాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం వంటివి సంస్థ నష్టాలకు కారణమైనట్లు తెలుస్తోంది.. కార్యకాలపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.1296 కోట్ల నుంచి రూ.1045 కోట్లకు తగ్గింది. మరోవైపు ఖర్చులు రూ.1505 కోట్ల నుంచి రూ.1597 కోట్లకు పెరిగినట్లు ఓలా కంపెనీ తెలిపింది.
రతన్ టాటా వీలునామాలో రహస్య వ్యక్తికి రూ.500 కోట్లు
దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా రాసిన మరో వీలునామా తాజాగా బయటకు వచ్చింది. అందులో జంషెడ్‌పుర్‌కు చెందిన ట్రావెల్స్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తాకు తన ఆస్తిలో రూ.500 కోట్లు ఇవ్వాలని రాసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇంగ్లీషు మీడియా కథనాలు వెలువరించింది. రతన్‌టాటకు మోహిని దత్తా సన్నిహితుడని టాటా గ్రూప్‌కు చెందిన అధికారులు చెబుతున్నారు. మోహన్ దత్తాకు చెందిన “స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ”.. తాజ్ సర్వీసెస్‌తో 2013 నుంచి పనిచేస్తున్నాయి. రతన్ టాటాకు రూ.10వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. ఆయన మరణం తర్వాత బటయకు వచ్చిన వీలునామా ప్రకారం.. ఈ ఆస్తులన్నీ ఆయన స్థాపించిన ఫౌండేషన్‌లు, సోదరుడు జిమ్మీ టాటాకు, తన దగ్గర పనిచేసిన సహయకులు, శాంతను నాయుడు, పెంపుడు శునకం టిటోకు రాసిచ్చారు. తాజాగా బయటకు వచ్చిన ఈ వీలునామా చూసి సన్నిహితులు ఆశ్చర్యపోతున్నారు.