బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ సెప్టెంబర్ 1న గ్రాండ్ లాంఛింగ్ జరిగింది. టాలీవుడ్ అగ్ర హీరో, అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. గతేడాది లాగే ఈసారి కూడా మొత్తం 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించారు. లిమిట్ లెస్ ఎంటర్ టైన్మెంట్ అంటూ ముందు నుంచి చెబుతున్నట్లుగానే బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్ అట్టహాసంగా జరిగింది. కంటెస్టెంట్స్‌తో పాటు సినిమా సెలబ్రిటీలు ఈ రియాలిటీ షోలో సందడి చేశారు. ఎంతో ఉత్సాహంగా సాగిన బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ లోనూ దుమ్ము దులిపింది. ఏకంగా 18.9 టీఆర్పీతో గత రికార్డులను బద్దలు కొట్టింది. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
‘5.9 బిలియన్ నిమిషాల రికార్డు బ్రేకింగ్ వ్యూస్. ఎంటర్టైన్మెంట్ పవర్ ఇలా ఉంటుంది. బిగ్ బాస్ తెలుగు 8 రేటింగ్‌ల రికార్డులను బద్దలు కొట్టింది. బిగ్ బాస్ కొత్త శిఖరాలకు చేరుకునేలా చేసిన మీ ప్రేమాభిమానాలను చూసి మాకెంతో సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో మేం మరిన్ని కొత్త ప్రమాణాలు ఏర్పాటు చేస్తున్నాం’ అంటూ బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్ కు 18.9 రేటింగ్ వచ్చిన విషయాన్ని చెప్పుకొచ్చారు నాగార్జున. అదిరిపోయే రికార్డులు రావడంతో బిగ్ బాస్ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అట్టహాసంగా జరిగిన బిగ్ బాస్ -8 ఓపెనింగ్ ఎపిసోడ్లో కంటెస్టెంట్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సందడి చేశారు. నేచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి, నివేదా థామస్, అనిల్ రావిపూడి వంటి స్టార్స్ వచ్చి బిగ్ బాస్ షోలో మరింత ఉత్సాహాన్ని నింపారు.