రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్లు వస్తున్న వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ కలిగిన నేతల్లో పుతిన్ ఒకరు. అలాంటి పరిస్థితుల్లో ఆయనపై కుట్ర జరిగినట్లు మాస్కో అధికార వర్గాలు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
రష్యా వర్గాల సమాచారం ప్రకారం.. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న సమయంలో కొన్ని నెలల క్రితం నోవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ ప్రైవేట్ నివాసం సమీపంలో పుతిన్‌పై ఉక్రెయిన్ హత్యాయత్నానికి పాల్పడినట్టు మాస్కో అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని అప్పట్లో గోప్యంగా ఉంచినట్లు రష్యా వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ (FSO) పుతిన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. ఆయన బహిరంగ కార్యక్రమాలు, పర్యటనలను గణనీయంగా తగ్గించుకున్నారు. భద్రతా కారణాల వల్ల ప్రస్తుతం పుతిన్ అత్యంత పరిమిత వర్గంతోనే సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పుతిన్ ఎక్కువ సమయం భూగర్భ బంకర్లలోనే గడుపుతున్నట్లు అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. యుద్ధ వ్యూహాలు, రక్షణ చర్యలను అక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారని… ఆయన ఉన్న ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పరికరాల వినియోగంపై కూడా కఠిన పరిమితులు విధించారని వెల్లడించాయి.
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల ముప్పు నేపథ్యంలో ఎఫ్ఎస్ఓ భద్రతా తనిఖీలను మరింత విస్తరించిందని ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా మాస్కో నది పరిసరాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లు తెలుస్తోంది. దేశంలోని పలువురు కీలక అధికారుల భద్రతను కూడా పెంచినట్లు నివేదికలు చెబుతున్నాయి.
అయితే పుతిన్‌పై నేరుగా హత్యాయత్నం జరిగిందన్న వార్తలను అమెరికా, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఖండించాయి. ఇలాంటి సమాచారం నిజమని తమ వద్ద ఆధారాలు లేవని పేర్కొన్నాయి.
కాగా గతంలో కూడా పుతిన్‌పై పలుమార్లు హత్యాయత్నాల వార్తలు వెలుగుచూశాయి. కానీ ప్రతి సారి రష్యా భద్రతా వ్యవస్థ వాటిని సమర్థంగా ఎదుర్కొన్నట్లు మాస్కో ప్రకటిస్తూ వచ్చింది.


