తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. బుధవారం ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఏపీ హైకోర్టు నిరాకరించడంతో.. సాయంత్రం నుంచి పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్నవారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నందిగం సురేష్ ఉద్దండరాయుని పాలెంలోని నివాసంలో అందుబాటులో లేకపోవడంతో.. ఆయన ఆచూకీ కోసం గాలించారు. హైదరాబాద్ మియాపూర్‌లో ఉన్నట్టు గుర్తించిన మంగళగిరి పోలీసులు.. అక్కడి పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ఏపీ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. అనంతరం మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్ంయలో తలశిల రఘురాం, దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ, జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఎలాంటి కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది.