ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మిర్చి యార్డ్ అధికారులతో, ట్రేడర్స్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ ఏడాది మిర్చి ధరల పతనంతో తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మిర్చి ధరలు పడిపోవడంతో ఏపీ రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో మిరప పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టనుంది.
రాష్ట్ర ప్రభుత్వం అంచనా ప్రకారం ఐదు లక్షల ఎకరాల్లో ఈ ఏడాది మిర్చి సాగైనట్టు అంచనా. 12 లక్షల మెట్రిక్ టన్నుల్లో.. ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్నులను వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి. ఇక, మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై మిర్చి రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు ఏపీలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులకు వెతనం మద్దతు పెంచే దిశగా కేంద్ర వ్యవసాయ శాఖ పరిశీలన చేపట్టింది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, మిర్చి ఎగుమతులను పెంచే అవకాశాలను పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, మిర్చి ఉత్పత్తి పెరుగుదలకు నూతన విధానాలు అమలు చేయాలని కూడా సూచించారు. ఏపీలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.