బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై హత్యాయత్నం జరగడంతో ముంబై ఉలిక్కిపడింది. ముఖ్యంగా సెలబ్రిటీలు నివసించే బాంద్రాలో అర్ధరాత్రి జరిగిన దాడి ఘటన భయాందోళన కలిగిస్తోంది. దాడికి రెండు గంటల ముందు వరకు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఎవరూ ప్రవేశించినట్టుగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాలేదు. అంటే నటుడిపై దాడి చేసిన వ్యక్తి అంతకుముందే ఇంట్లోకి ప్రవేశించి .. దాడి చేసేందుకు సరైన సమయం కోసం ఎదురుచూశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొడవ సమయంలో 54 ఏళ్ల సైఫ్ అలీఖాన్‌ని ఆరుసార్లు పొడిచి పారిపోయిన వ్యక్తిని గుర్తించడానికి పోలీసులు సిసిటివి ఫుటేజీని స్కాన్ చేస్తున్నారు.
సైఫ్ అలీఖాన్‌పై దాడి తెల్లవారుజామున 2.30 గంటలకు జరిగిందని, అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరూ లోపలికి ప్రవేశించినట్లు CCTV ఫుటేజీలో కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. దాడి చేసిన వ్యక్తి ముందుగానే నటుడి ఇంట్లోకి ప్రవేశించి లోపల దాక్కున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
పలువురు ప్రముఖులు నివసించే బాంద్రాలో జరిగిన దాడి ముంబై పోలీసులకు సవాల్‌గా మారింది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నివాసంలోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడ్డాడు. దొంగతనానికి ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసి పరారైనట్లు చెబుతున్నారు. దొంగతో జరిగిన ఘర్షణలో నటుడికి ఆరు చోట్ల గాయాలయ్యాయి. రెండు చోట్ల లోతుగా గాయాలయ్యాయి. ప్రస్తుతం సైఫ్‌కు ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ముంబైలో ప్రముఖులకు భద్రత లేదని, లా అండ్ ఆర్డర్‌పై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబా సిద్ధిక్ హత్య తర్వాత అతని కుటుంబం ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తోందన్నారు. సల్మాన్ ఖాన్ బుల్లెట్ ప్రూఫ్ ఇంట్లో నివసించాల్సి వస్తుందని చెప్పారు. ఇప్పుడు సైఫ్ అలీఖాన్, సెలబ్రిటీలు అత్యధికంగా ఉండే బాంద్రాలో తగిన భద్రత ఉండాల్సిన ప్రాంతమని అన్నారు. సెలబ్రిటీలకు భద్రత లేకపోతే ముంబైలో ఎవరుంటారు? సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.. అని చతుర్వేది అన్నారు.