దేశ రాజధాని ఢిల్లీలో బాలురు, యువకుల మధ్య చిన్న చిన్న వివాదాలు తీవ్ర హింసాత్మకంగా మారి ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా పితంపుర మరియు సీలంపూర్ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు కత్తిపోట్ల ఘటనల్లో ఒక 9వ తరగతి విద్యార్థితో సహా ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పితంపుర ప్రాంతంలో బుధవారం సాయంత్రం దుర్గామాత విగ్రహ నిమజ్జన ఊరేగింపు జరుగుతున్న సమయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఇన్స్టాగ్రామ్’లో చేసిన ఒక కామెంట్‌కు సంబంధించి ఆషు అనే యువకుడికి, కొందరు బాలురకు మధ్య వివాదం నెలకొంది.
విగ్రహ నిమజ్జన ఊరేగింపు పితంపుర గుండా వెళ్తున్న సమయంలో నిందితులు ఆషును చుట్టుముట్టి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ అకస్మాత్తు దాడిలో ఆషుకు మద్దతుగా ఉన్న 9వ తరగతి విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆషు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో గల సెంట్రల్ పార్క్‌లో మంగళవారం సాయంత్రం మరో ఘోరం జరిగింది. సుభాన్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి పార్క్‌లో ధూమపానం చేస్తుండగా, 5 నుంచి 6 మంది బాలుర బృందం వచ్చి అక్కడ పొగతాగడాన్ని వ్యతిరేకించింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వివాదానికి దారితీసింది.
ఆవేశంతో రగిలిపోయిన ఆ బృందం సుభాన్‌పై తీవ్రంగా దాడి చేసి కత్తులతో పొడిచింది. తీవ్రంగా గాయపడిన సుభాన్‌ను మొదట జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం జిటిబి ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు మైనర్లతో సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు.


