ఆధ్యాత్మిక సాధనలు, మానసిక ప్రశాంతత పేరుతో బోధనలు చేసే ఓ గురూజీ అసలు స్వరూపం బయటపడింది. భక్తి ముసుగులో ఓ వివాహితకు అసభ్యకర సందేశాలు పంపుతూ, ప్రశ్నించిన ఆమె భర్తను ఏకంగా చంపేస్తానని బెదిరింపులకు దిగిన ఆరోపణలు వచ్చాయి. దీంతో వివాదాస్పద ‘శ్రీచైతన్య గురూజీ’ అలియాస్ మేరెడ్డి సునీల్‌రెడ్డిపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
———–
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 71లో ‘శ్రీవిద్యా సాధనా సెంటర్’ పేరుతో మేరెడ్డి సునీల్‌రెడ్డి ఓ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10, స్రవంతి నగర్‌కు చెందిన విష్ణుదీప్రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ఆధ్యాత్మిక చింతనతో సునీల్‌రెడ్డి నిర్వహిస్తున్న శ్రీవిద్యా సాధనా సెంటర్‌కు వెళ్లేవారు. ఈ క్రమంలో కేంద్ర నిర్వాహకుడైన సునీల్‌రెడ్డి ఆధ్యాత్మిక సాధనల నెపంతో ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమె ప్రైవేట్ నంబర్‌కు తరచూ వాట్సాప్ మెసేజ్‌లు పంపుతూ, వ్యక్తిగత సంభాషణలు జరిపేవాడు.
———-
ఇటీవల ఈ వ్యవహారం భర్త విష్ణుదీప్రెడ్డి దృష్టికి వచ్చింది. భార్య ఫోన్లో ఉన్న సందేశాలను చూసి తీవ్ర ఆందోళనకు గురైన ఆయన, నేరుగా శ్రీవిద్యా సాధనా కేంద్రానికి వెళ్లి సునీల్‌రెడ్డిని నిలదీశారు. వివాహితకు ఇలాంటి మెసేజ్‌లు పంపడం ఏమిటని ప్రశ్నించగా, సునీల్‌రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. రివర్స్‌లో విష్ణుదీప్రెడ్డిపై విరుచుకుపడటమే కాకుండా, ఆయన జీవితాన్ని నాశనం చేస్తానని, మరోసారి ఇటువైపు వస్తే ప్రాణాలతో ఉంచనని తీవ్రంగా బెదిరించాడు.
———–
ఈ ఘోర పరిణామాలతో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వైవాహిక జీవితంలో తీవ్ర గందరగోళం, మనశ్శాంతి కరువైంది. దీంతో ధైర్యం చేసిన విష్ణుదీప్రెడ్డి, సునీల్‌రెడ్డి తన భార్యకు పంపిన అసభ్యకర సందేశాలు, ఆడియో ఆధారాలు, బెదిరింపులకు సంబంధించిన ఆధారాలన్నింటినీ సేకరించి నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
————
పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు, ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ‘శ్రీచైతన్య గురూజీ’ మేరెడ్డి సునీల్‌రెడ్డిపై BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆధ్యాత్మికత పేరుతో ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతుండగా, పోలీసులు ఈ ఘటనపై తీవ్రస్థాయిలో దర్యాప్తు వేగవంతం చేశారు.
ఆధ్యాత్మికత ముసుగులో వివాహితకు వేధింపులు
Latest Articles
- Advertisement -


