గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన కలిగించేలా, సమాజంలో చీలికలు తెచ్చే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా హింసాత్మక చర్యలకు పాల్పడటం సరికాదని అన్నారు. ఉపాధ్యాయుల పట్ల వైసీపీకి గౌరవం లేదని విమర్శించారు. కోవిడ్ సమయంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద విధుల్లో నిలబెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. డీఎస్సీ నియామకాలపై ఏవైనా అవకతవకలు జరిగితే శాసనసభలో ధైర్యంగా మాట్లాడాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సూచించారు.
ఏపీపీఎస్సీ, డీఎస్సీ మధ్య తేడా కూడా జగన్‌కు తెలియదంటూ మంత్రి వ్యాఖ్యానించారు. మద్యం వ్యవహారంపై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం విక్రయాల్లో రూ.1.30 లక్షల కోట్ల లావాదేవీలు జరిగితే, కేవలం రూ.600 కోట్ల మేరకే డిజిటల్ చెల్లింపులు జరిగినట్లు పేర్కొన్నారు. కల్తీ మద్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వచ్చి రాజకీయంగా ఎదుర్కోవాలని, చర్చకు సిద్ధంగా ఉండాలని జగన్‌ను కోరారు. ఎక్సైజ్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి రావడంతోనే వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్‌కు తెరలేపిందని నాదెండ్ల ఆరోపించారు.
ఇకా రాష్ట్రంలోని వర్షాలపై నాదెండ్ల మాట్లాడుతూ.. తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు, పశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులతో కలిసి అప్రమత్తంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.


