ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. నిన్న 5 రోజుల చిన్నారి ఊపిరాడక మృతి చెందింది.. ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో శిశువు మృతి చెందింది.
నిన్న అర్ధరాత్రి ఆస్పత్రి నవజాత శిశువుల ప్రత్యేక రక్షణ వార్డులో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఒక్కసారిగా ఏసీలో మంటలు చెలరేగాయి. చుట్టూ దట్టంగా పొగ వ్యాపించింది. వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో 5 రోజుల వయస్సున్న చిన్నారి మృతిచెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరో శిశువు మృతి చెందింది.
అర్ధరాత్రి ఏసీ పేలి పోవడంతో భారీగా మంటలు వ్యాపించాయి. చుట్టూ దట్టంగా పొగ కమ్మేసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, తల్లిదండ్రులు .. వార్డు అద్దాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ ఉన్న శిశువులను బయటకు తీసుకొచ్చి పరుగులు తీశారు.
అనంతరం అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందగానే ఫైర్ సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదం జరిగినప్పుడు వార్డులో 27 మంది చిన్నారులు ఉన్నారు. మంటలు, పొగతో పలువురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులను వేర్వేరు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారులకు వైద్య చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


