నమో చారిత్రాత్మక విజయాలు

బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో మోదీ పేరు గుజరాత్ వ్యాప్తంగా మారుమోగిపోయింది. పేదల హక్కుల కోసం ఎల్.కె. అద్వానీతో కలిసి ‘న్యాయ్ యాత్ర’లో ఆయన పాల్గొన్నారు. 1989 లోక్‌సభ ఎన్నికలకు క్షేత్రస్థాయిలో పార్టీని సన్నద్ధం చేసే బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు. అదే ఏడాది ‘లోక్ శక్తి యాత్ర’ను కూడా విజయవంతంగా నిర్వహించారు. ఆయన వ్యూహాలకు ప్రతిఫలంగా 1990 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 67 స్థానాలు గెలుచుకుని, చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరి అధికారంలోకి వచ్చింది.

గుజరాత్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మోదీ సేవలను జాతీయ స్థాయికి విస్తరించాలని బీజేపీ అధిష్టానం భావించింది. 1990లో ఎల్.కె. అద్వానీ చేపట్టిన చారిత్రాత్మక రామరథ యాత్రతో పాటు, 1991లో మురళీ మనోహర్ జోషి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన ‘ఏక్తా యాత్ర’ను ఏఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వహించడంలో మోదీ పాత్ర అద్వితీయం. సంస్థాగత వ్యవహారాల్లో ఆయన ప్రతిభను గుర్తించిన పార్టీ, 1995లో ఆయనను బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించింది. ఆ వయసులో ఉత్తరాదిలోని ఐదు కీలకమైన రాష్ట్రాల బాధ్యతలు అప్పగించడం ఆయనపై పార్టీకి ఉన్న నమ్మకానికి నిదర్శనం. అదే 1995లో గుజరాత్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 121 సీట్లు సాధించి పూర్తి మెజారిటీతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మోదీ వ్యూహరచనకు అద్దం పడుతోంది.

బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఢిల్లీకి మకాం మార్చిన మోదీ, జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారారు. పార్టీలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 1998లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలను పూర్తిగా పర్యవేక్షిస్తూ, దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలు సాధించడంలో మోదీ సంస్థాగత వ్యూహాలు ఎంతో ఉపయోగపడ్డాయి. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నాయకులతో సమన్వయం చేసుకుంటూ, పార్టీ నిర్మాణాన్ని కిందిస్థాయి నుంచి బలోపేతం చేస్తూ ఆయన తనదైన శైలిలో దూసుకుపోయారు. ఢిల్లీ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన వ్యూహకర్తగా ఆయన స్థానం సుస్థిరంగా మారిపోయింది.

ఢిల్లీలో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న మోదీ జీవితంలో 2001లో ఒక అతిపెద్ద బాధ్యత ఎదురైంది. గుజరాత్‌లో సంభవించిన ఘోర భూకంపం కారణంగా సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ ఆరోగ్యం సహకరించకపోవడం, రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలు కావడంతో జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేశూభాయ్ పటేల్ స్థానంలో నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. 2001 అక్టోబర్ 7వ తేదీన నరేంద్ర మోదీ తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భూకంపంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని తిరిగి నిర్మించాల్సిన అతిపెద్ద సవాల్ ఆయన ముందు నిలిచింది. ఎలాంటి పరిపాలనా అనుభవం లేకపోయినా, తన పట్టుదలతో ఆ బాధ్యతను ఆయన విజయవంతంగా స్వీకరించారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ బీజేపీని రికార్డు స్థాయి విజయంతో అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 2003లో ఆయన ప్రారంభించిన ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ అయింది. పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు 2004లో కన్యా కేలవణి, శాలా ప్రవేశోత్సవ్ కార్యక్రమాలను ప్రారంభించారు. 2007 ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్ నుంచి వెనక్కి వచ్చిన టాటా నానో ప్రాజెక్టును 2008లో కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే గుజరాత్‌కు తీసుకువచ్చి పారిశ్రామిక వేత్తల మన్ననలు పొందారు. గ్రామీణ సేవలను డిజిటలైజ్ చేస్తూ 2009లో ఈ-గ్రామ్ విశ్వగ్రామ్ యోజనను ప్రారంభించారు.

గతంలో కరువు కాటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న గుజరాత్‌ను, దేశానికే గ్రోత్ ఇంజిన్‌గా మోదీ మార్చివేశారు. పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టారు. 2011లో సామాజిక సామరస్యం కోసం ఆయన చేపట్టిన సద్భావన యాత్ర దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. 2012లో వరుసగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, గుజరాత్ చరిత్రలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆయన ఫోటో ప్రచురితమైంది. ఆయన సాధించిన విజయాలు, నిర్ణయాత్మక పాలనా సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం, 2013లో ఆయనను 2014 లోక్‌సభ ఎన్నికలకు తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. ఒక సామాన్య కార్యకర్త దేశ భవిష్యత్తును మార్చే నాయకుడిగా ఎదగడానికి ఇది నాంది పలికింది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. 1984 తర్వాత ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ రావడం అదే తొలిసారి. 2014 మే 26న దేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించి అంతర్జాతీయంగా ఆయన తమ దౌత్యపరమైన వ్యూహాన్ని చాటారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అదే ఏడాది అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ను ప్రారంభించి స్వయంగా చీపురు పట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారు.

రక్షణ రంగంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం చొరవ చూపింది. సాయుధ దళాల సిబ్బందికి ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్‌ను 2015 నవంబర్‌లో అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన రుజువు చేశారు. 2016 సెప్టెంబర్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 19 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఆ దాడికి ప్రతీకారంగా పక్షం రోజుల వ్యవధిలోనే భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకువెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తూ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ప్రపంచవ్యాప్తంగా భారత సత్తాను చాటిచెప్పాయి. జాతీయ భద్రత విషయంలో మోదీ రాజీలేని వైఖరిని స్పష్టం చేశాయి.

ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ప్రధాని మోదీ ఎవరూ ఊహించని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. నల్లధనం, పన్ను ఎగవేతలను అరికట్టే లక్ష్యంతో 2016 నవంబర్ 8 రాత్రి 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ సంచలన ప్రకటన చేశారు. స్వాతంత్రానంతరం బ్రిటీష్ కాలం నుంచి వస్తున్న రైల్వే బడ్జెట్‌ను 2017లో మొట్టమొదటిసారిగా సాధారణ బడ్జెట్‌లో విలీనం చేసి సరికొత్త సంస్కరణలకు తెరతీశారు. దేశవ్యాప్తంగా పన్నుల వ్యవస్థను ఏకీకృతం చేస్తూ, ఒకే దేశం ఒకే పన్ను విధానంతో 2017 జూలై 1 నుంచి చారిత్రాత్మక వస్తు సేవల పన్ను జీఎస్టీని అమలులోకి తీసుకొచ్చారు. అనేక అడ్డంకులు, విమర్శలు ఎదురైనప్పటికీ దేశ దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసమే ఆయన ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారని ప్రభుత్వం బలంగా విశ్వసించింది.

సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు మోదీ సర్కార్ గట్టిగా బుద్ధి చెప్పింది. 2017లో డోక్లాం వద్ద చైనా సైన్యం అక్రమంగా రోడ్డు నిర్మిస్తుండగా 73 రోజుల పాటు భారత సైన్యం కళ్లకు కళ్లు పెట్టి ఎదురొడ్డి నిలిచింది. దౌత్యపరమైన చర్చలతో చైనాను వెనక్కి తగ్గేలా చేసింది. మరోవైపు రక్షణ శాఖ కుదుర్చుకున్న రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. సామాజిక న్యాయంలో భాగంగా జనరల్ కేటగిరీలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019లో చారిత్రాత్మక రాజ్యాంగ సవరణ చేశారు. సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించే దిశగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 377ను సుప్రీంకోర్టు రద్దు చేసే విషయంలో ప్రభుత్వం కోర్టు విజ్ఞతకే వదిలేస్తూ ఒక ప్రగతిశీల నిర్ణయం తీసుకుంది.

2019 ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే భారత వాయుసేన పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోకి ప్రవేశించి జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ పరిణామాలు దేశంలో జాతీయవాదాన్ని ఉప్పొంగేలా చేశాయి. ఈ నేపథ్యంలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మునుపటి కంటే భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించింది. 2019 మే 30న నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ఏకంగా ఎనిమిది వేల మందికి పైగా హాజరు కావడం, బిమ్స్‌టెక్ దేశాల అధినేతలను ఆహ్వానించడం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోయింది.

రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే మోదీ ప్రభుత్వం దశాబ్దాలుగా ఎవరూ సాహసించని సంచలన నిర్ణయం తీసుకుంది. 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ సమగ్రతను కాపాడే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అదే ఏడాది చివర్లో పొరుగు దేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొని భారత్‌కు వలస వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టం, అనగా సీఏఏను పార్లమెంట్‌లో ఆమోదించింది. దీనిపై దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వం తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. దేశ అంతర్గత భద్రత కోసమే ఈ చట్టమని స్పష్టం చేసింది.

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి సమయంలో ప్రధాని మోదీ దేశాన్ని ముందుండి నడిపించారు. 2020 మార్చిలో జనతా కర్ఫ్యూతో మొదలుపెట్టి, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఆ తర్వాత స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కోవిడ్ వ్యాక్సిన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు. వంద కోట్ల డోసుల మైలురాయిని రికార్డు సమయంలో అధిగమించి భారత్ సత్తాను ప్రపంచానికి చాటారు. మరోవైపు వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే ఉద్దేశంతో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేశారు. దేశ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, రైతుల మనోభావాలను గౌరవిస్తూ 2021 నవంబర్‌లో ప్రధాని మోదీ స్వయంగా ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి తన పరిణితిని చాటుకున్నారు.

2020 జూన్‌లో లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మోదీ, భారత్ శాంతిని కోరుకుంటుందని కానీ కవ్విస్తే దీటైన బదులిస్తుందని హెచ్చరించారు. సాయుధ దళాల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు 2022లో అగ్నిపథ్ స్కీమ్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనా, సైన్యం ఆధునీకరణకు ఇది అవసరమని ప్రభుత్వం భావించింది. ప్రధాని మోదీ దార్శనికతతో, దశాబ్ద కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి నేడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలతో నవభారత నిర్మాణం దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోంది.

దేశ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని 2023 మే నెలలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ‘సెంగోల్’ను లోక్‌సభ స్పీకర్ స్థానం వద్ద ప్రతిష్ఠించి భారతీయ సంస్కృతికి పెద్దపీట వేశారు. అంతరిక్ష రంగంలో 2023 ఆగస్టు 23న భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్, చంద్రుని దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండ్ అయి ప్రపంచంలోనే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ను నిలబెట్టింది. 2023 సెప్టెంబర్‌లో ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు భారత్ అత్యంత విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చింది. ప్రపంచ వేదికపై భారత దౌత్యపరమైన ఆధిపత్యాన్ని, నాయకత్వ పటిమను ఈ సదస్సు మరింతగా ఇనుమడింపజేసింది.

కోట్లాది మంది హిందువుల ఐదు వందల ఏళ్ల కలను సాకారం చేస్తూ, 2024 జనవరి 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో రామ్‌లల్లా విగ్రహానికి ప్రధాని మోదీ స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ చారిత్రక ఘట్టం కోసం ఆయన 11 రోజుల పాటు ప్రత్యేక దీక్ష చేపట్టారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ వారణాసి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోయినా, ఎన్డీఏ కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించింది.

నరేంద్ర మోదీ విదేశీ విధానంలో ఇటీవల ఒక స్పష్టమైన, వ్యూహాత్మక మార్పు కనిపిస్తోంది. 2014 నుంచి 2019 వరకు భారతదేశాన్ని ప్రపంచానికి మార్గదర్శిగా నిలిపే ‘విశ్వగురు’ భావనకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. స్వామి వివేకానంద, శ్రీ అరబిందో వంటి మహనీయుల స్ఫూర్తితో భారతీయ యోగా, ఆయుర్వేదం, ప్రాచీన తత్వశాస్త్రం ద్వారా ప్రపంచస్థాయిలో సాఫ్ట్ పవర్‌ను పెంచుకునే ప్రయత్నం చేసింది. అయితే, ఈ విశ్వగురు విధానం అంతర్జాతీయ దౌత్యంలో, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు, పొరుగు దేశాలకు ఒకరకమైన ఆధిపత్య ధోరణిలా కనిపించింది. ఇతర దేశాలకు గురువులా వ్యవహరించడం కంటే, నమ్మకమైన స్నేహితుడిగా ఉండటమే 21వ శతాబ్దపు దౌత్యానికి అవసరమని భావించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ‘విశ్వమిత్ర’ అనే సరికొత్త విధానానికి తెరతీసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా మారి, ప్రపంచానికి ఒక సమగ్రమైన భాగస్వామిగా భారత్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది.

ఈ సరికొత్త ‘విశ్వమిత్ర’ విధానంతో క్వాడ్, బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ వంటి భిన్నమైన భావజాలాలున్న కూటములతో భారత్ అత్యంత విజయవంతంగా సమన్వయం చేసుకుంటోంది. వ్యాక్సిన్ మైత్రి, విపత్తుల సమయంలో మానవతా సహాయం అందించడం ద్వారా ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో స్నేహబంధాన్ని పటిష్టం చేసుకుంటోంది. అయితే, అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు లేదా శాశ్వత శత్రువులు ఉండరని, కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయన్నది చేదు నిజం. అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాలతో కొనసాగుతున్న ఒడిదుడుకుల సంబంధాలు ఈ వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి. దౌత్యపరంగా చూస్తే విశ్వగురు, విశ్వమిత్ర లాంటి పదాలు కేవలం దేశీయంగా రాజకీయ బలాన్ని, నైతిక ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఉపయోగపడే సాధనాలుగా మాత్రమే పనిచేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి అంతర్జాతీయ స్థాయిలో తగిన ఆర్థిక, సైనిక బలం ఉంటేనే ఈ తరహా దౌత్యపరమైన నినాదాలకు అసలైన సార్థకత చేకూరుతుంది. మిత్రపక్షాల ఆమోదంతో నరేంద్ర మోదీ ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికై, జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. 1950లో వాద్‌నగర్‌లో మొదలైన ఆయన ప్రస్థానం నేడు 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇవ్వాళ 76వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మోదీ.. ఇలాంటి బర్త్ డేలు మరిన్ని జరుపుకోవాలని భారతీయులంతా ఆశిస్తున్నారు.

Latest Articles

సాధారణ టీ అమ్మే స్థాయి నుంచి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మహానేతగా నరేంద్ర మోదీ

సాధారణ టీ అమ్మే స్థాయి నుంచి దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన మహానేత నరేంద్ర మోదీ. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, తన కృషితో, పట్టుదలతో ప్రపంచంలోనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్