ఓ వైపు శుద్ధీకరణ అంశం.. మరోవైపు ఎమ్మెల్యేలపై అనుచిత ప్రవర్తన అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేసింది. సభలో బీఆర్ఎస్ నినాదాలు.. ఎస్సీల ఆత్మగౌరవంపై కాంగ్రెస్ పట్టు.. తెలంగాణ అసెంబ్లీలో మూడో రోజు కూడా గందరగోళం ఏర్పడింది. నిన్న కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ జరిగిన పరిణామాలపై అసెంబ్లీ వేదికగా మంటలు రేగాయి. సభ ప్రారంభం కాగానే శుద్ధీకరణ అంశంపై చర్చిద్దామని ప్రభుత్వం ప్రకటించింది. నిన్న ఫౌమ్ హౌస్ దగ్గర కాంగ్రెస్ ఎస్సీ నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని బీఆర్‌ఎస్ కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్ధి చేశారని… శుద్ధి పేరుతో ఎస్సీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉదయం సభ ప్రారంభం నుంచే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఓ వైపు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతున్నా.. బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. అయితే సంయమనం పాటించాలని… సభ సజావుగా సాగేలా సహకరించాలని స్పీకర్ కోరారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు కొనసాగడంతో వారిని సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు. మొత్తం 22 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులను సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.


