మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం జరిగింది. DSC అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని .. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని బొత్స డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో నచ్చినవారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని.. గ్రూప్-1 అంశంపై చర్చకు తాము సిద్ధమని బొత్స స్పష్టం చేశారు. బొత్స వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. DSCపై మాట్లాడే హక్కు గొడ్డలి పార్టీకి లేదన్నారు. ఐదేళ్లలో వైసీపీ ఒక్క DSC నిర్వహించలేదన్న ఆయన.. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని.. బొత్స విద్యాశాఖ మంత్రిగా ఉండి ఉద్యోగాలు ఇవ్వలేని దద్దమ్మ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. మనిషి పెరిగితే సరిపోదని.. భాష నేర్చుకోవాలని బొత్స సూచించారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన అచ్చెన్నాయుడు.. తాను అన్‌పార్లమెంటరీ వర్డ్స్ ఎప్పుడు మాట్లాడలేదన్నారు. ఐదేళ్ల అధికారంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వలేదని..DSC నిర్వహిస్తామని నిరుద్యోగులను మోసం చేశారన్నారు. దద్దమ్మ అనేది అన్‌పార్లమెంటరీ పదమా? అంటూ ప్రశ్నించారు. చేతకాని వాళ్లను దద్దమ్మ అనే అంటారని అచ్చెన్నాయుడు అన్నారు.


