కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్‌కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త నెరేటివ్‌ను భుజాన వేసుకుంది. కాంగ్రెస్ పాలనపై జనం విసిగిపోయారని, 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే బావబామ్మర్దులు క్షేత్రస్థాయిలో గొంతు చించుకుంటున్నా.. గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌస్ గడప దాటి బయటకు రావడం లేదు. అసలు రాష్ట్రంలో కేసీఆర్ పాలన మళ్లీ రావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా? పార్టీ కేడర్‌లో నెలకొన్న తీవ్ర నైరాశ్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే గులాబీ నేతలు ఈ ప్రచార అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారా?

తెలంగాణలో అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి.. సరికొత్త రాజకీయ అంకానికి శ్రీకారం చుట్టింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు వ్యూహాత్మకంగా ఒక కొత్త నెరేటివ్‌ను జనం మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందనే వాదనను పదేపదే వినిపిస్తున్నారు. రాష్ట్రాన్ని పరిపాలించడం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చేతకావడం లేదని, గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోవడం ఒక రకంగా రాష్ట్ర ప్రజలకే మంచిదైందని వారు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ పాలనలోని సుస్థిరత, ఆయన పరిపాలనా దక్షత విలువ ఏమిటో ఇప్పుడు తెలంగాణ సమాజానికి కళ్లకు కట్టినట్లు తెలిసివచ్చిందని కేటీఆర్ పక్షం బలంగా ప్రచారం చేస్తోంది. అందుకే ప్రజలంతా ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని కోరుకుంటున్నారని, 2028 ఎన్నికల్లో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఖాయమనే ఒక మానసిక వాతావరణాన్ని సృష్టించే పనిలో గులాబీ ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు.

ఒకవైపు కేటీఆర్, హరీశ్ రావు క్షేత్రస్థాయిలో కేసీఆర్ నామజపాన్ని హోరెత్తిస్తుంటే.. స్వయంగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఈ ప్రచారానికి పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ను విడిచి బయటకు రావడం లేదు. అధికారం కోల్పోయిన తర్వాత గడిచిన ఈ సుదీర్ఘ కాలంలో ఆయన బయట కనిపించింది కేవలం వేళ్లమీద లెక్కపెట్టగలిగినన్ని సార్లు మాత్రమే. అందులో రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలకు అలా వచ్చి ఇలా వెళ్లగా, మరోసారి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సమయంలో నందినగర్ ఇంట్లో కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే అందుబాటులో ఉన్నారు. కనీసం తనను ఎమ్మెల్యేగా గెలిపించిన సొంత నియోజకవర్గం గజ్వేల్ ప్రజల ముఖం చూసి కూడా రెండున్నరేళ్లు గడిచిపోయింది. కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తెచ్చారని కేటీఆర్ సభల్లో చెబుతున్నా.. గులాబీ బాస్ మాత్రం జనానికి ముఖం చాటేయడం రాజకీయ వర్గాల్లో విస్మయానికి గురిచేస్తోంది. కేసీఆర్ బయటకు రాకుండా కేవలం భజన చేయడం వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఉండదన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్న బీఆర్ఎస్ వాదనల్లో డొల్లతనాన్ని.. ఆ పార్టీ ముఖ్య నాయకుడే స్వయంగా బయటపెట్టారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ ఇటీవల బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. సరిగ్గా ఈ సమయంలోనే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పార్టీ అంతర్గత సమావేశంలో చేసిన వ్యాఖ్యలు గులాబీ పక్షాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పార్టీ చేపడుతున్న ధర్నాలకు రైతులు, సాధారణ ప్రజలు రావడం లేదని సుమన్ కుండబద్దలు కొట్టారు. వంద మంది బీఆర్ఎస్ నాయకులు ధర్నాలో కూర్చుంటే, అక్కడ కేవలం ముగ్గురు నలుగురు రైతులు మాత్రమే ఉంటున్నారన్న చేదు వాస్తవాన్ని ఆయన అంగీకరించారు. జనం దృష్టిని ఆకర్షించాలంటే ‘మిలిటెంట్ చర్యలు’ చేయక తప్పదంటూ ఆయన చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చివరికి ఆయన జ్యుడిషియల్ రిమాండ్‌కు దారితీశాయి. కేటీఆర్ చెబుతున్నట్లుగా జనం నిజంగానే కాంగ్రెస్ పాలనపై విసిగిపోయి ఉంటే, కొనుగోలు కేంద్రాల వద్ద గులాబీ ఆందోళనలకు రైతులు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదన్న సత్యం సుమన్ వ్యాఖ్యలతో బహిర్గతమైంది.

బీఆర్ఎస్ అధిష్టానం ఈ ‘కేసీఆర్ మళ్లీ రావాలి’ అనే నినాదాన్ని తెరపైకి తేవడం వెనుక అసలు ఉద్దేశం.. నిలువునా కుంగిపోతున్న సొంత కేడర్‌ను కాపాడుకోవడమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా దక్కకపోవడం కేడర్‌ను మానసికంగా తీవ్రంగా దెబ్బతీసింది. దానికి తోడు తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార పక్షంలో చేరడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు రావడం కార్యకర్తల్లో నైరాశ్యాన్ని నింపాయి. వీటన్నింటికీ మించి.. ‘అధికారం ఇస్తే సేవ చేస్తా, లేదంటే ఫామ్‌హౌస్‌లో పండుకుంటా’ అని గతంలో కేసీఆర్ చెప్పిన మాటలు అక్షరసత్యం అవుతుండటం కేడర్‌ను మరింత డీమోరల్ చేసింది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయంలో అధినేత ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. కేడర్ చేజారిపోకుండా, వారిలో కృత్రిమంగానైనా ఒక ఆశను బతికించి ఉంచడానికే ఈ ‘2028 సీఎం కేసీఆర్’ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ శ్రేణుల సహనం క్రమంగా నశిస్తోందన్న వాస్తవం ఆ పార్టీ అంతర్గత సమావేశాల్లోనే స్పష్టమవుతోంది. ఇటీవల ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపై, పార్టీ సభ్యత్వ నమోదుపై రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఎనభైకి పైగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సమన్వయ సభలు నిర్వహించింది. ఈ ఎనభై సభల్లో ఏ ఒక్కదానికీ పార్టీ అధినేత కేసీఆర్ హాజరుకాలేదు. బావబామ్మర్దులు కేటీఆర్, హరీశ్ రావు మాత్రమే మొత్తం భారాన్ని భుజాన వేసుకుని తిరిగారు. తమను కష్టకాలంలో ముందుండి నడిపించాల్సిన నాయకుడు కనీసం పార్టీ అంతర్గత సమావేశాలకు కూడా రాకపోవడంపై కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. కేవలం పదవి ఉన్నప్పుడు మాత్రమే జనానికి కనిపించి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను గాలికి వదిలేసే నైజం కేసీఆర్‌ది అన్న అపవాదు స్థిరపడిపోయింది. కేటీఆర్, హరీశ్ రావు జనం మధ్య నుంచి ఎన్ని ప్రగల్భాలు పలికినా.. కేసీఆర్ మాత్రం రోడ్డెక్కి పోరాడే ప్రసక్తే లేదని రాజకీయ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. ఈ మైండ్ గేమ్ ప్రచారం కేవలం కేడర్ వలసలను ఆపడానికే పరిమితమవుతుంది తప్ప, తెలంగాణ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపదన్నది అక్షరసత్యమన్న చర్చ జరుగుతోంది. మరి ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్‌హౌస్ వీడి బయటకు వస్తారా అన్నది వేచి చూడాలి.

Latest Articles

సాయికృష్ణది కస్టోడియల్‌ డెత్‌… సీఐ నాగరాజు రిమాండ్‌ రిపోర్టు

సీఐ నాగరాజు రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సాయికృష్ణది కస్టోడియల్‌ డెత్‌ అని రిమాండ్‌ రిపోర్టులో సిట్ అధికారులు తెలిపారు. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారని చెప్పింది సిట్‌. నాన్‌ బెయిలబుల్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్