ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన చేతులు, కాళ్లు కట్టేసి, తల గుండు చేసి, ముఖానికి బూడిద పూసి, దారుణంగా కొట్టడమే కాకుండా, తన పిల్లల ఎదుటే బలవంతంగా మూత్రం తాగించాడని ఆమె ఆరోపించింది.
ఈ ఘటనకు సంబంధించిన కొన్ని దృశ్యాలు వైరల్ అయ్యయి.. బాధితురాలు తారా సుమారు 15 సంవత్సరాల క్రితం జితేంద్ర ఘాసియాను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. దాంపత్య జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా విభేదాలు, వేధింపుల ఆరోపణలు, ఆర్థిక ఇబ్బందులు కొనసాగడంతో తారా భర్తకు దూరంగా వేరుగా ఉంటోంది. నాలుగు ఇళ్లలో పనిచేస్తూ తన పిల్లలను పోషించుకుంటోంది.
జూన్ 14న తన భర్త తాను ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడికి వచ్చాడని తారా పోలీసులకు తెలిపింది. కష్టకాలంలో తనకు సహాయం చేసిన ఓ పరిచయస్తుడి ఇంట్లో ఆమె ఉంటున్నట్లు సమాచారం. అక్కడికి వచ్చిన భర్త ఆమెను బయటకు పిలిచి, ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకున్నావంటూ ఆరోపిస్తూ దూషించడం ప్రారంభించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.


