విజయవాడ రాజకీయాల్లో కేశినేని బ్రదర్స్ ఎపిసోడ్ మరోసారి హీట్ పుట్టిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ కేశినేని నాని.. మళ్లీ అనూహ్యంగా యాక్టివ్ అవుతున్నారు. సొంత సోదరుడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని లక్ష్యంగా సోషల్ మీడియాలో సెటైర్లు, లేఖలతో పొలిటికల్ వార్ నడుపుతున్నారు. కేవలం కుటుంబ ఆస్తుల పంచాయతీగా మొదలైన ఈ వివాదం, ఇప్పుడు భవిష్యత్ రాజకీయ వ్యూహంగా మారుతోందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ కేశినేని నాని మరోసారి విజయవాడ ఎంపీగా బరిలోకి దిగబోతున్నారా? బ్రదర్స్ మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు బెజవాడ పాలిటిక్స్‌లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది?
విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పొలిటికల్ స్క్రీన్‌పై మరోసారి మెరుపులు మెరిపిస్తున్నారు. గత కొంతకాలంగా పూర్తిగా సైలెంట్‌గా ఉన్న ఆయన.. ఇప్పుడు వరుస ట్వీట్లు, ఘాటైన లేఖలతో బెజవాడ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కిస్తున్నారు. ఎన్నికల తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పిన నానిలో ఇప్పుడు అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఆయన వేస్తున్న అడుగులు, చేస్తున్న విమర్శలు గమనిస్తే భవిష్యత్తులో మరోసారి విజయవాడ నుంచి పోటీ చేసేందుకు పక్కా ప్లాన్‌తోనే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఆయన ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉన్నప్పటికీ.. బెజవాడ ఎంపీగా గెలిచి తీరాలన్న కసి, పట్టుదల మాత్రం ఆయన వ్యూహాల్లో అణువణువునా కనిపిస్తోంది. ఈ లక్ష్య సాధన కోసమే ఆయన తన సోదరుడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
కేశినేని బ్రదర్స్ మధ్య ఈ పొలిటికల్ వార్ రాత్రికి రాత్రే మొదలైంది కాదు. దీని వెనుక పెద్ద కుటుంబ, రాజకీయ వివాదాల చరిత్రే ఉంది. కేశినేని నాని గతంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. కేశినేని చిన్ని భార్య తన వాహనానికి ఎంపీ స్టిక్కర్ వాడుకున్నారంటూ స్వయంగా నాని పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఒకే కుటుంబంలో ఉన్న ఈ ఇద్దరు సోదరుల మధ్య ఆస్తుల పంచాయతీలు తీవ్ర స్థాయికి చేరడం, దానికి తోడు రాజకీయ ఆధిపత్య పోరు తోడవడంతో ఇద్దరి మధ్య దూరం పూడ్చలేని విధంగా పెరిగిపోయింది. ఈ వ్యక్తిగత విభేదాలు కాస్తా నియోజకవర్గంలో పార్టీ కేడర్‌ను సైతం రెండు వర్గాలుగా విడదీసే స్థాయికి చేరాయి. అక్కడి నుంచి ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు వ్యూహాలు మొదలుపెట్టారు.
బ్రదర్స్ మధ్య ముదిరిన ఈ వివాదం 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి పతాక స్థాయికి చేరింది. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన తనకే మళ్లీ ఎంపీ టికెట్ వస్తుందని నాని బలంగా భావించారు. కానీ టీడీపీ నాయకత్వం అనూహ్యంగా కేశినేని నానికి ఎంపీ టికెట్ నిరాకరించి, ఆయన స్థానంలో సోదరుడు కేశినేని చిన్నికి బరిలోకి దింపింది. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నాని.. సైకిల్ దిగి ఫ్యాన్ గూటికి చేరారు. వైసీపీ అభ్యర్థిగా విజయవాడ ఎంపీ స్థానం నుంచి తన సోదరుడిపైనే నేరుగా పోటీకి దిగారు. ఆ ఎన్నికల సమరంలో కేశినేని చిన్ని ఘన విజయం సాధించగా.. నాని పరాజయం పాలయ్యారు. సొంత సోదరుడి చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని కేశినేని నాని.. ఇక రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెబుతున్నట్లు సంచలన ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పిన కేశినేని నాని.. ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్ వేదికగా చేస్తున్న పోస్టులు పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు చిన్నిపై లేఖలు రాయడం ద్వారా ఆయన మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంపీ చిన్నిని లక్ష్యంగా చేసుకుని నాని ఫేస్‌బుక్‌లో పెట్టిన ‘పిట్టల దొర’ పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. చిన్ని ప్రెస్‌మీట్ పెట్టి తనపై పిట్ట కథలు చెబుతున్నారంటూ నాని తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు. తన అప్పులు, ఆస్తులు, ఆదాయం, బ్యాంక్ అకౌంట్ల గురించి ప్రెస్‌మీట్లలో మాట్లాడటం కాదని ఆయన సవాల్ విసిరారు. దమ్ముంటే తనపై ప్రధానమంత్రికి, కేంద్ర హోంమంత్రికి, లేదా సీబీఐ, ఈడీ సంస్థలకు అధికారికంగా ఫిర్యాదులు చేయాలి కానీ, గల్లీలో ప్రెస్‌మీట్లు పెట్టి విమర్శలు చేయడం ఏంటని నాని సూటిగా నిలదీశారు. తన ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కేశినేని నాని చేస్తున్న ఈ ఘాటైన విమర్శలకు ఎంపీ కేశినేని చిన్ని కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అంతే బలంగా కౌంటర్లు ఇస్తున్నారు. నాని ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తున్నారు. ఇది కేవలం అన్నదమ్ముల మధ్య జరుగుతున్న ఆస్తి వివాదమో లేదా ఆధిపత్య పోరో కాదు. కేశినేని నాని వేస్తున్న ప్రతి అడుగు పక్కా రాజకీయ వ్యూహంలో భాగమే. విజయవాడ ఎంపీ స్థానాన్ని మళ్లీ దక్కించుకునేందుకు ఆయన ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో తన ఉనికిని చాటుకుంటూ వచ్చే ఎన్నికలకు బలమైన అభ్యర్థిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. మొత్తానికి బెజవాడ బ్రదర్స్ వార్ రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరతీయడం ఖాయంగా కనిపిస్తోంది.


